ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు సీఎం జగన్ నేడు నిధులు విడుదల చేయనున్నారు. వివిధ పథకాలకు 3 లక్షల 39 వేల 96 మంది లబ్ధిదారులు కొత్తగా ఎంపిక కాగా.. వారందరికీ ఇవాళ నిధులు మంజూరు కానున్నాయి. పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం లబ్ధిదారుల ఎంపిక కాగా.. ఈ పథకాల కోసం రూ.935 కోట్లు నిధులను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) విడుదల చేస్తారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. మరోవైపు.. వైయస్సార్ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) వెల్లడించింది. ఏపీలోని విద్యార్థులను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకొంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ట్యాబ్స్ ఇవ్వాలని నిర్ణయించారు.
మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం జగన్ సున్నితంగా హెచ్చరిక చేశారు. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని, 175 సీట్లు గెలిచి తీరాలని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రతి గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు ఇవ్వడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఆ బాధ్యత తనదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. కొన్ని పనులతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు సాధించడం కష్టం కాదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వరుసగా రెండో నెల వర్క్‌షాప్ నిర్వహించారు సీఎం జగన్. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. ఇప్పటికీ కార్యక్రమాన్ని మొదలు పెట్టని వారు వెంటనే జనంలోకి వెళ్లాలని ఆదేశించారు. ఎవరు ఎన్ని రోజులు కార్యక్రమాన్ని చేశారన్న వివరాలను సమావేశంలో చర్చించారు.
కొన్ని లక్షల మంది వైసీపీ ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నారు. వాళ్లందరికీ న్యాయం జరగాలంటే మళ్లీ అధికారంలోకి రావాల్సిందే. నేతల వల్ల పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే అలాంటి వారి విషయంలో కచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గడప గడపకు వెళ్లి చేసిన కార్యక్రమాలను గుర్తు చేయాలి. ఆ పనిని మరింత క్వాలిటీగా చేసినప్పుడే ఎమ్మెల్యేలు చిరస్థాయిగా ఉండిపోతారు.
– వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..