CM Jagan Women’s day gift : అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మహిళా నేతలు సీఎం జగన్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా మహిళలకు వరాలు కురిపించారు. క్యాజువల్ లీవ్స్ 15 నుంచి 20కి పెంపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్. రాష్ట్రంలోని మహిళలందరికీ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గడచిన 21 నెలల్లో మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు సీఎం తెలిపారు. అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, కాపు నేస్తం, మహిళల పేరుతోనే ఇంటి స్థలాలు, వైయస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చినట్టు ముఖ్యమంత్రి వివరించారు.
నామినేటెడ్ పోస్టులతోపాటు నామినేషన్ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు ఆయన తెలిపారు. మహిళలపై జరిగే నేరాల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం కోసం దిశ బిల్, ప్రత్యేక న్యాయస్థానాలు తెచ్చినట్టు కూడా సీఎం జగన్ వెల్లడించారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ వాహనాలను ముఖ్యమంత్రి కాసేపట్లో ప్రారంభించనున్నారు.
ఇక, వరల్డ్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని కాంక్షిస్తూ వినూత్న రీతిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్కో రోజా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చిత్తూరు చింతల పట్టడలోని ఓ దళిత వాడకు వెళ్లి కేక్ కట్ చేశారు. మహిళా దినోత్సవాన్ని సందర్భంగా నారీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పేదలకు అమలు చేస్తున్నారని రోజా చెప్పారు. మహిళలు స్వయంపాలన, సాధికారిక సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు రోజా.
మహిళా దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సైకత శిల్పాన్ని నెల్లూరులో మంచాల సనత్‌కుమార్ రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, నవ్యాంధ్రకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రులుగా చేయడంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కీలకంగా వ్యవహరించారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్ ప్రశంసించారు.