ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరోసారి ఓటీఎస్ తెరపైకి వచ్చింది. గతంలో గృహ నిర్మాణశాఖ నుంచి రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల కోసం ఓటీఎస్ పథకాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం.. తాజాగా పన్ను బకాయిల వసూలుకు ఓటీఎస్(One Time Settlement)) విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్(CM Jagan) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటీఎస్ పథకం ద్వారా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి.. దీని ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చనే అంశాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు.
ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పత్రాలతో రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై గ్రామ, వార్డు కార్యదర్శులకు శిక్షణ కూడా అందిస్తున్నామని వెల్లడించారు. తొలివిడతలో భాగంగా అక్టోబర్ 2 నాటికి రిజిస్ట్రేషన్ సేవలు అందించే గ్రామాల సంఖ్య పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. అంతే కాకుండా వాణిజ్య పన్నుల శాఖను పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నాటికి డాటా అనలిటిక్స్ విభాగం, లీగల్‌సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బకాయిల వసూలుకు ఓటీఎస్ సదుపాయం తీసుకురావాలన్నారు. వీలైనంత ఎక్కువగా బకాయిలు వసూలు చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అక్రమ మద్యం తయారీ, అక్రమ మద్యం రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు. వీలైనన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి