Andhra Pradesh: రౌడీయిజం చేస్తే రాష్ట్రం నుంచి తరిమేస్తాం.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్..

నేరాలు, రౌడీయిజంపై రాజీలేని పోరాటం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలను నివారించాలని పోలీసులను ఆదేశించారు. తిరుపతిలో భక్తుల భద్రతతో పాటు డ్రగ్స్, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు సంబంధించి పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Andhra Pradesh: రౌడీయిజం చేస్తే రాష్ట్రం నుంచి తరిమేస్తాం.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్..
Cm Chandrababu Tirupati Visit

Updated on: Dec 26, 2025 | 7:39 PM

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అవసరమైతే అటువంటి వారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపే సంస్కృతి తమదని గుర్తుచేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం నిశితంగా నిఘా ఉంచిందని తెలిపారు. తిరుపతిలో హోంమంత్రి అనితతో కలిసి ఆయన అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం, తన అభిప్రాయాలను, సూచనలను రాశారు.

భక్తుల భద్రతే ముఖ్యం

త్వరలో రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడుతూనే.. భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతా భావం కల్పించే బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తిరుపతి ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులను సీఎం అభినందించారు. అలాగే ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టడంలో, నిందితులపై పీడీ యాక్టులు ప్రయోగించడంలో పోలీసులు చూపిస్తున్న చొరవను ఆయన కొనియాడారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయని సీఎం విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటి సంస్కృతిని విడనాడాలని అన్నారు. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనలను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో అటువంటివి పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులను ఆదేశించారు. టెక్నాలజీని వాడుకుని నేర నియంత్రణ చేయాలని సీఎం సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఒక అడుగు ముందుండాలని, డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పోలీసుల ఉనికి కనిపిస్తూనే, నేరస్తులకు తెలియకుండా నిఘా పెట్టే విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..