
ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రవాణా, ఇంధన రంగంలో ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని విస్తరించడంతో పాటు రాష్ట్రానికి త్వరలోనే భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు.
మంగళవారం విద్యుత్ శాఖపై చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రవాణా రంగంపై కీలక ప్రకటన చేశారు.
ఏపీఎస్ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యం, పెరుగుతున్న పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సులను తీసుకువస్తున్నారు. భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి కొత్త బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి మొత్తం 1050 విద్యుత్ బస్సులు త్వరలోనే రానున్నాయి. వీటిని రాష్ట్రంలోని వివిధ డిపోలకు కేటాయిస్తారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం పరిధిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విస్తరించింది. సిటీలు, పల్లెటూర్లకు తిరిగే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రస్తుతం గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని పొందుతున్నారు.
రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, పునరుత్పాదక ఇంధన వినియోగంపై సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా ఎక్కడా అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించడంలో భాగంగా ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ అంశాలను పరిశీలించాలని, అలాగే అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు.
పీఎం కుసుమ్ సహా రూఫ్‌టాప్ ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలో 5 వేల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే థర్మల్ పవర్ స్టేషన్లలో ఉత్పత్తి అయ్యే బూడిదను ఇతర అవసరాలకు ఉపయోగించాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.