
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిమీ మేర వీరి ప్రయాణం సాగింది. మంగళగిరి నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం చేశారు. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు తరలివచ్చారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దివ్యాంగులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక బస్టాప్‌కు బస్సు చేరుకుంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఇప్పటికే బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే దివ్యాంగులకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తోండగా.. ఇకపై ఉచితంగా ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. అనంతరం మార్చి 18 నుంచి ప్రారంభించారు. అందరికీ సమాన అవకాశాలు అందించేలా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. వారి వెంట వచ్చే సహాయకులతో కలిపి 12.76 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.
దివ్యాంగుల్లో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తోంది. కాగా స్త్రీ శక్తి పథకంతో రాష్ట్రంలో మహిళలకు ఆర్ధిక వెసులు బాటు, సాధికారత కల్పించింది. గతేడాది ఆగస్ట్ 15న స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తే… ఈ మార్చి 15 నాటికి… అంటే 7 నెలల్లో 52 కోట్ల ప్రయాణాలు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దీనికి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,826 కోట్లు రాయితీ భరించింది.