Tirumala Laddu: ‘తిరుపతి లడ్డూ కోసం జంతు నూనె వాడారు..’ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్

|

Sep 18, 2024 | 9:09 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ప్రసాదమైన లడ్డూని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందన్నారు సీఎం చంద్రబాబు. వారు లడ్డూ తయారీ కోసం నెయ్యి కాకుండా.. జంతు నూనె వాడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

Tirumala Laddu: తిరుపతి లడ్డూ కోసం జంతు నూనె వాడారు.. సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్
CM Chandrababu Naidu
Follow us on

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని భక్తులు ఎంత మంత్రముగ్దులు అవుతారో.. శ్రీవారి ప్రసాదం లడ్డూను స్వీకరించి అంతే అనుభూతిని పొందుతారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న సమాచారం భక్తులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

గత ప్రభుత్వం తిరుమల లడ్డూను అపవిత్రం చేసిందంటూ సంచలన కామెంట్స్‌ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు . లడ్డూ తయారీకి నాసిరకమైన సరుకులు వాడారన్నారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్‌ను వాడినట్టు తెలిసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి.. లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నట్లు చెప్పారు.

గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని తేల్చింది సురేందర్ రెడ్డి కమిటీ. నాణ్యతలేని నెయ్యి వల్లే లడ్డూలపై భక్తులు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. నాణ్యతలేని నెయ్యిని సరఫరా చేసినవారిని బ్లాక్‌ లిక్‌ లిస్ట్‌లో పెట్టింది. లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఒప్పందం చేసుకుంది. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ గతంలో 20 ఏళ్ల పాటు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది.

నిత్యం తిరుమలలో భక్తులకు దాదాపు మూడున్నర లక్షల లడ్డూలను ప్రసాదంగా జారీ చేస్తుంది టీటీడీ. లడ్డూ పవిత్రతను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామంది. అన్న ప్రసాదాల తయారీలోనూ నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తామని ప్రకటించింది.

అయితే గతంలో జంతువుల కొవ్వును లడ్డూ తయారీకి వినియోగించారన్న ఆరోపణలు భక్తుల బుర్రను గిర్రున తిప్పుతున్నాయి. స్వామివారి ప్రసాదంలో యానిమల్ ఫాట్ కలవడం చిన్నవిషయం కాదంటున్నారు భక్తులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక వరదల నేపథ్యంలో  350 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని.. ఇదొక చరిత్ర అన్నారు చంద్రబాబు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఒప్పుకుంటే.. ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరం ఒక నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇద్దామని కోరారు సీఎం చంద్రబాబు. ప్రపంచం అంతా స్పందించిదని.. మనం కూడా కూడా స్పందిస్తే హుందాగా ఉంటుందన్నారు సీఎం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.