Andhra Pradesh: మంత్రి ఇలాఖాలో నేతల రచ్చ.. ఎలా ఏగేది అంటూ తలపట్టుకుంటున్న పార్టీ శ్రేణులు..

|

Jun 25, 2022 | 8:08 AM

Andhra Pradesh: వారంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు. కానీ మండల స్థాయి సమావేశం జరిగిన ప్రతిసారీ.. గొడవ తప్పనిసరి. అదే ప్రకాశం జిల్లా..

Andhra Pradesh: మంత్రి ఇలాఖాలో నేతల రచ్చ.. ఎలా ఏగేది అంటూ తలపట్టుకుంటున్న పార్టీ శ్రేణులు..
Ycp
Follow us on

Andhra Pradesh: వారంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు. కానీ మండల స్థాయి సమావేశం జరిగిన ప్రతిసారీ.. గొడవ తప్పనిసరి. అదే ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వైసీపీ నేతల తీరు. వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సర్వసభ సమావేశం ఎప్పటిలాగే రసభసాగా జరిగింది. అభివృద్ధి పనుల విషయంలో MPP సుబ్బారెడ్డి, మాజీ MPP ప్రస్తుత MPTC అంజిరెడ్డి మధ్య వాగ్వివాదం ఘాటుగా సాగింది. MPPగా ఉండి మండల అభివృద్ధిని పట్టించకోవటం లేదంటూ సుబ్బారెడ్డిని అంజిరెడ్డి నిలదీశారు. అయితే ‘‘నువ్వేమైనా తక్కువ తిన్నావా.. గతంలో నువ్వు MPPగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావంటూ..’’ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అప్పుడే అభివృద్ధి పనులు చేసి ఉంటే అడగవలసిన అవసరం ఉండేది కాదుగా అంటూ నిలదీశారు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

సమావేశం హాలులో పార్టీ నేతల ముందు వీళ్లిద్దరు వాదులాడుకోవడంతో పార్టీనేతలకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. వీరిద్దరి తీరుపై అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయి. వాటికి కౌంటర్లు ఇస్తూ అధికార పార్టీ నేతలు ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. పార్టీ వర్గాలకు మింగుడు పడటం లేదు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాఖాలో సొంత పార్టీ నాయకులు వర్గాలుగా విడిపోయి సమావేశాల్లో ఇలా గొడవలు పడటం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. మంత్రి కలగచేసుకొని నాయకులను ఎకతాటి పైకి తేవాలని కార్యకర్తలు భావిస్తున్నారు. లేదంటే పార్టీకే నష్టం తప్పదనే చర్చ జరుగుతోంది.