
Clashes in Krishna: చిన్న చిన్న వాటికే కోపోద్రిక్తులవుతున్నారు కొందరు. ఏ మాత్రం ఓపికతో ఉండడం లేదు. ఆవేశంతో ఊగిపోతూ గొడవలకు వెళ్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇదే జరిగింది. ఇన్నాళ్లూ పక్క పక్కనే కలిసి ఉన్న రెండు కుటుంబాలు.. కత్తులు నూరుకున్నాయి. గుడివాడ మండలం మోటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక మోటూరు హరిజనవాడలో వికలాంగురాలైన నాగమణి, ఈశ్వర్ కుటుంబాలు ఉంటున్నాయి. ఇటీవల వీరి మధ్య పొరపొచ్చలు ఏర్పడ్డాయి. అది కూడా వారు ఉంటున్న ఇంటి సరిహద్దు విషయంలోనే. దీంతో మొదట మాటకు మాట అనుకున్నారు. అది తారాస్థాయికి చేరడంతో చేయి చేసుకునే వరకు వెళ్లిన గొడవలు.. చివరకు కత్తులదో దాడులు చేసుకునే వరకు చేరుకుంది. ఈ దాడిలో వికలాంగురాలైన నాగమణిపై ఈశ్వర్ కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన నాగమణితో పాటు ఆమె సోదరుడు బాల సుబ్రహ్మణ్యంకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఆ సమయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కాలనీలో ఒక్కసారిగా ఉద్రిక్తతను పెంచింది. వారిని స్థానికులు నిలువరించే యత్నం చేయకపోవడం దారుణం. ఆ తర్వాత దాడి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ బాలసుబ్రహ్మణ్యంను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటి సరిహద్దు విషయంలో తలెత్తిన గొడవపై పోలీసులు విచారణ చేపట్టారు. పల్లెల్లో అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఒక కుటుంబంలా జీవిస్తారు. కానీ రాను రాను ఆ పరిస్థితులు లేకుండా పోతున్నాయి. అనురాగాలు, ఆప్యాయతల స్థానంలో ఆర్ధిక సంబంధాలు వచ్చి చేరడంతో ఇటీవల ఇలాంటి గొడవలు కామన్‌గా మారుతుండడం కలవరం రేపుతున్నాయి.
Also read: