Amaravati Land Scam case : అమరావతి రాజధాని భూముల స్కామ్ పై సీఐడి దర్యాప్తు ముమ్మరమైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మందడం గ్రామానికి చెందిన దళిత రైతులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రైతుల నుండి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణకు ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వాటిని సవాలు చేస్తూ హైకోర్టులో వారిద్దరు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ రోజు హైకోర్టులో వాటిపై విచారణ జరుగుతోంది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో పలు వివరాలను తన పిటిషన్ లో పేర్కొన్న చంద్రబాబు.. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని తన తరఫు న్యాయవాదుల ద్వారా కోర్టును కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూత్ర, నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తున్నారు.
రాజధాని గ్రామాల ప్రజలకు భూసమీకరణ విధానాన్ని తెలిపిన పిమ్మట భూసమీకరణ పథకాన్ని తీసుకొచ్చి, ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించారు. భూసమీకరణపై 2015, జనవరి 1న జీవో 1 జారీ చేశారు. అసైన్డ్ భూముల హక్కుదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు 2016, ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయ్యాయి. చట్ట నిబంధనల మేరకే ఆ జీవో జారీచేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దురుద్దేశంతో వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చంద్రబాబు పిటిషన్‌లో ఆరోపించారు.
ఒకవేళ నిబంధనలపై అభ్యంతరాలు ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టులో సవాలు చేసుకోవచ్చని, అంతేగానీ, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు రూపొందించారనే కారణంతో తనను నేర బాధ్యుడిగా పేర్కొనడం అసంబద్ధమని చంద్రబాబు పిటిషన్ లో తెలిపారు. తాము నష్టపోయామని గ్రామస్థులుగానీ, భూ యజమానులుగానీ ఇన్నేళ్లుగా ముందుకు రాలేదని, ఇప్పుడు వారి తరఫున వైసీపీ నేత అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం చూస్తే ప్రత్యర్థి పార్టీపై అనుమానాలు కలుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Read also : Mekapati Goutham Reddy : కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో భేటీ, లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటులో సాయం కోరిన మేకపాటి