Chinchinada Bridge Fact Check: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ.. వశిష్టానది నదిపై నిర్మించిన వారధి చించినాడ బ్రిడ్జ్. దీనినే దిండి బ్రిడ్జి అని కూడా అంటారు. ఈ బ్రిడ్జి ఉభయగోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మధ్య రవాణా మరింత సులభమయ్యింది. అయితే ఈ చించినాడ బ్రిడ్జ్ కుంగిపోయిందని సోషల్ మీడియాలో ఫేక్ వీడియో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. దీంతో మల్కిపురం, పాలకొల్లు పోలీసులు రంగంలోకి దిగి.. బ్రిడ్జి ని అణువణువు పరిశీలించారు.
అనంతరం రాజోలు సీఐ దుర్గాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము వంతెనను పరిశీలించామని.. ఎక్కడా ఎటువంటి కుంగుబాటు కనిపించలేదని అన్నారు. ఎక్కడో వంతెన కుంగిపోతే.. అది చించినాడ వంతెన అంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంత మాత్రం నిజంలేదని అన్నారు. అంతేకాదు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుర్గా శేఖర్ చెప్పారు.
చించినాడ వంతెన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లును తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు కలుపుతుంది. కోనసీమవాసులు దిండి బ్రిడ్జ్ నుంచి పాలకొల్లు మీదుగా విజయవాడ, ఇక పశ్చిమగోదావరి జిల్లా వాసులు ఈ వంతెన మీదుగా రాజోలు, విశాఖపట్నం వయా కాకినాడ అలాగే.. ఈ ఊరు నుండి మలికిపురం మీదుగా అంతర్వేది లక్ష్మీనరశింహస్వామి దేవాలయానికి ఈజీగా చేరుకుంటారు. అంతేకాదు దిండి బ్రిడ్జ్ గోదావరి తీరం ఒడ్డున కేరళను తలపించేలా.. దిండి రిసాట్ ప్రదేశం ఉంది. ఇక్కడ బోటు ద్వారా గోదావరిలో పర్యటించవచ్చు.