తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై పరోక్షంగా స్పందించారు. ఏపీలోని అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసిన చంద్రబాబు.. ఎవరైనా అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో.. తెలంగాణలో చూశామని అన్నారు. చేయని తప్పుకు తనను 50 రోజులకు పైగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తనకు సంఘీభావం తెలిపారని చెప్పారు చంద్రబాబు.పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈసారి వచ్చిన తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని అన్నారు. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం నందివెలుగు వద్ద దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు.