
Chandrababu Naidu Arrest: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 11 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఓ వైపు బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. మరోవైపు సీఐడీ కస్టడీ పిటిషన్‌తో పాటు వేర్వేరు కేసుల్లో పీటీ వారెంట్లతో హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ అక్రమాలపై ఏసీబీ కోర్ట్‌లో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. లేటెస్ట్‌గా ఫైబర్ నెట్ స్కామ్‌లో కూడా పీటీ వారెంట్ వేసింది. అసలు పీటీ వారెంట్ అంటే ఏంటి? చంద్రబాబు మీద ఎందుకు ఇన్ని వారెంట్‌లు వేస్తున్నారు?
పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ అని అర్ధం.. ఇప్పటికే ఏదైనా కేసులో అరెస్టై జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరతారు. అప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం కోసం తీసుకునే అనుమతి. సీఆర్పీసీలోని సెక్షన్ 269 కింద కోర్టు పీటీ వారెంట్‌ని ఇస్తుంది.
ఇప్పుడు చంద్రబాబు విషయానికి వస్తే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టై పది రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన పిటిషన్లపై కోర్టుల్లో ఇప్పటికే వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరపు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ పరిగణలోకి ఆ కేసును కొట్టేస్తారా.. లేదంటే కస్టడీకి అనుమతి ఇస్తారా అనేది కోర్ట్ తీర్పును బట్టి ఆధారపడి ఉంది. ఈ లోపే చంద్రబాబును వరుస కేసులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఏసీబీ కోర్టులో ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. సాధారణ బెయిల్, మధ్యంతర బెయిల్‌పై విచారణ జరగనుండగా.. సీఐడీ అధికారులు కౌంటర్ కూడా దాఖలు చేయనున్నారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు దాడి కేసుల్లో చంద్రబాబే నిందితుడని ఆరోపిస్తోంది సీఐడీ. ఈ కేసుల్లో చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. అయితే ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు.
ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కేసు చంద్రబాబు మెడకు చుట్టుకుంది. ఈ ఫైబర్ గ్రిడ్ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వానికి 115 కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారన్నారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో A1గా ఉన్న వేమూరి హరిప్రసాద్.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దీంతో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించింది. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయంటోంది సీఐడీ. అందుకే పీటీ వారెంట్ దాఖలు చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..