
ఏపీ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, వారిని వ్యాపారవేత్తలుగా మార్చాలని ప్రణాలికలు రచిస్తోంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీ సబ్సిడీలతో కూడిన రుణాలను అందిస్తోంది. ఈ రుణాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు జీవనోపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పథకాల అమలు కోసం వెలుగు, పశుసంవర్ధక శాఖ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నాయి.
మొదటగా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్ల కోసం రుణాలను అందిస్తారు. ఈ పథకంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చాలా ఎక్కువగా ఉంది. లక్ష విలువైన యూనిట్‌కు ప్రభుత్వం రూ.35వేల ప్రభుత్వ సబ్సీడి ఇస్తుండగా.. రూ.65 వేలు చెల్లించాలి. అదేవిధంగా 2లక్షల విలువైన యూనిట్‌కు రూ.75వేల వరకు సబ్సీడీ వస్తుండగా.. రూ. 1.25 లక్షలు తిరిగి చెల్లించాలి.
పశుపోషణతో పాటు ఇతర చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం రుణాలతో ప్రోత్సాహం అందిస్తోంది. బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ల వంటి చిన్న పరిశ్రమలకు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు అయ్యే ఖర్చులో భారీ సబ్సిడీతో కూడిన లోన్లు అందిస్తుంది. వరికోత యంత్రాలు, రోటావేటర్ల వంటి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు విలువైన యూనిట్లపై ఏకంగా రూ. 1.35 లక్షల వరకు రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళలు ఈ సబ్సిడీలు, రుణాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందాలని, ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అంతేకాకుండా మహిళల కోసం భవిష్యత్తులో మరిన్ని పథకాలను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.