Visakha Steel Plant Privatization: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావ్ కరాడ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కింద విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ వాటాను ప్రైవేటీకరిస్తూ 100% పెట్టుబడి ఉపసంహరించుకోవాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని, ఆ తరువాత, ఈ ఆలోచనను పునఃపరిశీలించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులకు సమాధానంగా తమ ఆలోచనలో మార్పు లేదన్న విషయాన్ని తెలియజేశామని వెల్లడించారు. న్యూ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ పాలసీ ప్రకారం ఉక్కు రంగాన్ని నాన్-స్ట్రాటజిక్ విభాగంలో ఉందని, అలాంటి వాటిని ప్రైవేటీకరించడమో లేక మూసివేయడమో చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు.
వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో మూలధనం మరింత సమకూరి ప్లాంట్ ఆధునీకరణ, విస్తరణకు తోడ్పడుతుందని, అలాగే అత్యుత్తమ నిర్వహణ పద్ధతులు అమల్లోకి వస్తాయని, ఫలితంగా ఉత్పాదతక మరింతగా పెరిగి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కూడా పెరుగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. మొత్తంగా ప్రైవేటీకరించిన అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగమవుతుందని సూత్రీకరించారు. ప్రైవేటీకరించే సమయంలో ఈ సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇతర భాగస్వామ్యుల అభ్యంతరాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఆ మేరకు షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరుపుకుంటామని తెలిపారు.
అన్నింటి కంటే ముఖ్యంగా తాము ఇప్పటి వరకు అమలు చేస్తున్న పెట్టుబడుల ఉపసంహరణ పద్ధతుల్లో అనదపు స్థలాలు, నాన్-కోర్ ఆస్తులను మినహాయిస్తున్నామని తెలిపారు. అంటే ప్లాంట్ ఉన్న భూమి మినహా, అదనంగా ఉన్న భూమి, ఇతర నాన్–కోర్ ఆస్తులు లావాదేవీల్లో భాగం కావని, తద్వారా అవి పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఉండవని స్పష్టం చేశారు.
Also read:
Suicide: విజయవాడలో దారుణం.. భర్త వేధింపులు తాళలేక మహిళ హోంగార్డ్ ఆత్మహత్య..