గడిచిన ఐదేళ్లలో ప్రజాధనం భారీగా వృధా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది… వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వైసీపీ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకున్నట్లు ప్రభుత్వ విచారణలో వెలుగు చూసింది.. వైయస్ఆర్సీపీ కోసం పనిచేసిన కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లక్షలాది రూపాయల జీతం చెల్లించినట్లు బయటపడింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ప్రభుత్వం గుర్తించింది. జీతాల పేరుతో భారీగా ప్రభుత్వ ఖాజానాకు నష్టం చేకూర్చినట్టు ప్రభుత్వ పెద్దలకు నివేదిక ఇచ్చారు అధికారులు.
బాధ్యులపై త్వరలో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం
ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తూ.. పార్టీ కోసం పని చేసిన వారి జాబితాను అధికారులు సిద్దం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేల మందికి లక్షల్లో జీతాలిచ్చి.. వారిని వైసీపీ కోసం పని చేయించుకున్నారని గుర్తించింది సర్కార్. అంతేకాకుండా ఐదేళ్లు పాటు ఆఫీసుకు రాకుండానే చాలా మందికి జీతాలు కూడా చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగుల పేరుతో అడ్డగోలు నియామకాలు జరిగాయని తేలింది. దీంతో వారి అటెండెన్స్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆయా ఉద్యోగుల లిస్ట్ కూడా సిద్ధం చేశారు. అర్హత లేకున్నా కొందరికి తప్పుడు రికార్డులతో నియామాకాలు జరిపారని బయటపడింది. నియామక పత్రాలు, అర్హత డాక్యుమెంట్ల పరిశీలనపై దర్యాప్తు చేస్తుంది ప్రభుత్వం.
ఇలా పలు శాఖల్లో కొంతమంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో 400 కోట్ల మేర దుర్వినియోగం జరిగిందని గుర్తించారు. దీనికి సంబంధించిన సమాచారం ఓ కొలిక్కి వచ్చాక కేసు నమోదు చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.