స్మశానంలో క్షుద్రపూజలు.. అర్థరాత్రి విచిత్ర మంత్రాలతో అలజడి.. గ్రామం అంతా భయం భయం

| Edited By: Jyothi Gadda

Oct 10, 2023 | 1:18 PM

Parvathipuram: అయితే అర్థరాత్రి తమ గ్రామ స్మశానంలో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? తమ గ్రామానికి వచ్చి తమ స్మశానంలోనే ఎందుకు చేయాల్సి వచ్చింది? తమ గ్రామానికి ఎవరైనా కీడు తలపెట్టడానికి ఈ పూజలు చేశారా? లేకపోతే తమ గ్రామంలో ఎవరికైనా హని చేయడం కోసం ఈ క్షుద్ర పూజలకు పాల్పడ్డారా? అదే నిజమైతే క్షుద్ర పూజల వల్ల ఎవరికి హని జరుగుతుంది? ఆ హని తలపెడుతున్న వ్యక్తి ఎవరు?

స్మశానంలో క్షుద్రపూజలు.. అర్థరాత్రి విచిత్ర మంత్రాలతో అలజడి.. గ్రామం అంతా భయం భయం
Black Magic
Follow us on

 ఉమ్మడి విజయనగరం జిల్లా, అక్టోబర్10; పార్వతీపురం మన్యం జిల్లాలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపుతుంది. అర్థరాత్రి పన్నెండు గంటలు. కురుపాం మండలం గొటివాడ గ్రామస్తులు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అదే మంచి సమయంగా భావించి ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడి నుండి మెల్లగా గ్రామ శివారులో ఉన్న స్మశానంలోకి ఎంటర్ అయ్యారు. అలా వెళ్లిన ఆరుగురు వ్యక్తులు స్మశానం ప్రాంగణంలో ఒకరి ఎదురుగా ఒకరు నెల మీద కూర్చొని తమతో తెచ్చుకున్న పసుపు, కుంకుమ, కోడిగుడ్లు, పండు మిరపకాయలు, కత్తి, దారం బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత కొద్ది సేపటికి సరిగ్గా పన్నెండు గంటలకు పూజలు ప్రారంభించారు.

ముందుగా ఒక ముగ్గు వేసి ఆ ముగ్గులో అనేక పదార్ధాలు వేసి మంత్రాలు చదువుతున్నారు. ఆ ఆరుగురు చేస్తున్న పూజలతో స్మశాన ప్రాంగణమంతా భయానకంగా మారింది. విచిత్రమైన పదాలు వాడుతూ పూజలు చేస్తూ అర్ధరాత్రి ఘోరమైన పూజలు జరిపారు. అయితే అదే సమయంలో స్మశానం పక్క నుండి వస్తున్న ఓ వ్యక్తికి స్మశానం లోపల నుండి వస్తున్న విచిత్రమైన శబ్దాలు, పూజల యొక్క మంత్రాలు వినిపించాయి. ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. స్మశానంలో నుండి వస్తున్న మాటలు విని స్మశానంలో ఒకరిద్దరు కాదు ఎక్కువమందే ఉన్నారని గమనించి గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు తెలియజేశాడు. వెంటనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు అంతా ఏకమై స్మశానంలోకి వచ్చారు. అప్పటికే ఆరుగురు వ్యక్తులు పూజలో నిమగ్నమై ఉన్నారు. వెంటనే గ్రామస్తులంతా ఆ ఆరుగురిని పట్టుకునే ప్రయత్నం చేశారు.

ఆ ప్రయత్నంలో గ్రామస్తులకు, పూజలు చేస్తున్న ఆరుగురికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో ఇద్దరు యువకులు తప్పించుకొని మోటార్ సైకిల్ పై పారిపోగా, మరో నలుగురు యువకులను పట్టుకుని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అసలు ఎందుకు వచ్చారు? ఎక్కడినుంచి వచ్చారు? జరుగుతున్న పూజలు ఏంటి? అనే విషయాల పై ఆరా తీశారు గ్రామస్తులు. ఆరుగురు కూడా ఒడిశా రాష్ట్రం రాయగడ సమీపంలోనే కొన్ని గ్రామాలకి చెందినవారిగా చెప్పారు. తాము పూజలు చేసేందుకు వచ్చామని, పూజలు చేసి ఓ మందు తయారు చేస్తామని, ఆ మందు వాడితే ఆరోగ్యం బాగుంటుందని, సిరి సంపదలు సిద్ధిస్తాయని తెలియజేశారు. అయితే వారు చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని, అసలు అర్ధరాత్రి స్మశానంలో క్షుద్ర పూజలు ఏంటని నిలదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అయితే అర్థరాత్రి తమ గ్రామ స్మశానంలో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? తమ గ్రామానికి వచ్చి తమ స్మశానంలోనే ఎందుకు చేయాల్సి వచ్చింది? తమ గ్రామానికి ఎవరైనా కీడు తలపెట్టడానికి ఈ పూజలు చేశారా? లేకపోతే తమ గ్రామంలో ఎవరికైనా హని చేయడం కోసం ఈ క్షుద్ర పూజలకు పాల్పడ్డారా? అదే నిజమైతే క్షుద్ర పూజల వల్ల ఎవరికి హని జరుగుతుంది? ఆ హని తలపెడుతున్న వ్యక్తి ఎవరు? తమ గ్రామ స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటే ఏదో జరగరానిది జరుగుతుందని తీవ్ర ఆందోళనలో పడ్డారు గ్రామస్తులు. జరిగిన క్షుద్ర పూజల ఘటనతో ఇప్పుడు గొటివాడ గ్రామస్తులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని నిత్యం భయం భయంగా గడుపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..