
ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా నాలుగు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఒక రైల్వే లైన్ ఏమీ మీదుగా వెళ్లనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలో ప్రాజెక్ట్ చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. తమిళనాడులోని గుమ్మిడిపుండి, ఏపీలోని గూడురు మధ్య 90 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ 4 ప్రాజెక్టుల నిర్మాణానికి మొత్తం రూ.9450 కోట్ల ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. పశ్చిమబెంగాల్, ఏపీ, తమిళనాడు. ఒడిశాలోని 8 జిల్లాల పరిధిలోనే ఈ కొత్త రైల్వే లైన్లు ఉండనున్నాయి. మొత్తం 410 కిలోమీటర్ల మేర ఉండనుండగా.. 6448 గ్రామాలను అనుసంధానించనుంది. మొత్తం 60 లక్షల జనాభాను కవర్ చేయనుంది. మెరుగైన రైలు కనెక్టివిటీకి ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. ఈ రైల్వే లైన్లు పూర్తయితే రైళ్ల రాకపోకలు పెరగడంతో పాటు పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు రైలు కనెక్టివిటీ లభిస్తుంది. ఇక ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు కూడా ఈ రైల్వే లైన్లు ప్రయోజనం చేకూర్చనున్నాయి. వీటి వల్ల ప్రతీ ఏడాది 76 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగనుంది. వీటి వల్ల 13 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గడంతో పాటు 65 కోట్ల కిలోల కార్బన్ డై అక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఈ రైల్వే లైన్లు ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీని పెంచనున్నాయి. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం, భద్రకాళీ టెంపుల్, పంచలింగేశ్వర ఆలయం వంటి ప్రాంతాలకు రైల్వే అనుసంధానం కలగనుంది. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్, ఒడిశాలోని భద్రక్ మధ్య 173 కిలోమీటర్ల మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణం జరగనుండగా.. భద్రక్-హరిదాస్ పూర్ మధ్య 75 కిలోమీటర్లు, కటక్-పారాదీప్ మధ్య 72 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఉండనుంది.
అయితే ఏపీ మీదుగా ఇప్పటికే పలు కొత్త రైల్వే లైన్లను రైల్వేశాఖను ప్రకటించింది. అలాగే బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులు కూడా ఏమీ మీదుగా వెళ్లనున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు-చెన్నై బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి. అలాగే విశాఖపట్నం-బెంగళూరు మధ్య మరో బుల్లెట్ రైల్ కారిడార్‌కు కూడా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. వీటి వల్ల ఏపీలో పారిశ్రామిక అభివృద్ది జరగనుంది.