Big News Big Debate – Konaseema violence: అమలాపురం అల్లర్లపై సంచలన ట్వీట్ చేసింది YCP. ఈ ఘటనలకు సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ, జనసేన కార్యకర్తలే అని.. అల్లర్లలో పాల్గొంది వారేనంటూ ఫొటోలతో సహా విడుదల చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన సంభాషణల ఫొటోలనూ పెట్టింది. ఆ పార్టీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. వాళ్లెవరూ తమకు తెలియదని.. విపక్షాలపై కుట్ర జరుగుతుంది అంటోంది జనసేన. అటు సొంత పార్టీ నేతలే చేశారమని మంత్రి ప్రకటించారని వాటిని బయటపెట్టాలన్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు.
కోనసీమ అల్లర్లకు రాజకీయ రంగు..
మీరంటే మీరే కారణమని అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం.
హింసాత్మక ఘటనల్లో పాల్గొంది టీడీపీ, జనసేన కార్యకర్తలే అంటూ వైసీపీ తాజాగా సంచలన ప్రకటన చేసింది. కొన్ని పోటోలను కూడా రిలీజ్ చేసింది. ఇందులో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలున్నారని ఆరోపించింది. జనసేన కార్యకర్త దుర్గాసాయి, అశెట్టి సాయిచంద్ర, రాచకొండ శివకుమార్, యర్రంశెట్టి బాలాజి, టీడీపీకి చెందిన పితాని దుర్గాప్రసాద్ ఆ రోజు అల్లర్లలో పాల్గొన్నారంటూ ఫొటోలను షేర్ చేసింది వైసీపీ. పార్టీ అధికారిక ట్వీట్ లో పెట్టడంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి విధ్వంసాలు అంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని, పోలీసులు ఇప్పటికే కొందరిని గుర్తించారన్నారు ఎంపీ.
అమలాపురం విధ్వంసం వెనక జనసేన ఉందన్న వైసీపీ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు జనసేన జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ. అల్లర్లను సృష్టించింది వైసీపీ ప్రభుత్వమేనన్నారు అన్ని జిల్లాలకు పేర్లు పెట్టి కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టారని విమర్శించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు.
తమ ఇళ్లను తగలబెట్టింది సొంతపార్టీ నేతలేనని విశ్వరూప్ చెబితే విపక్షాలపై విమర్శలు చేయడం ఏంటన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం నాయకులుంటే వారి బయట పెట్టాలన్నారు.
మొత్తానికి 62 మందిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో రాజకీయ పార్టీలకు చెందిన మరెంతమంది నాయకులు బయటకు వస్తారో? వీరి వెనకున్న వారు బయటపడితే ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..