టీడీపీ, జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయితీ మొదలైంది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యక్రమంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన కీలక ప్రకటన చేశారు. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగకముందే టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు ధర్మాన్ని టీడీపీ ఉల్లంఘించిందని అన్నారు. అందుకే తాను కూడా రాజోలు, రాజానగరం జనసేన అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటించానని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబుకు ఉన్నట్టే తనపై కూడా ఒత్తిడి ఉందని.. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని తెలిపారు. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తాను పట్టించుకోలేదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని అన్నారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని అన్నారు. పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. పొత్తులో భాగంగా మూడోవంతు సీట్లు తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ పొత్తు అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోవడం లేదని.. భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ సొంతంగా అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు నామమాత్రంగా సీట్లు ఇస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో.. ఆయన పొలిటికల్ ప్లాన్ మార్చారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని.. పొత్తులో భాగంగా 40 నుంచి 60 సీట్లు తీసుకోవాలని.. పవన్ కల్యాణ్ కనీసం రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని సీనియర్ కాపు నేత హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్‌కు సూచించారు. వాటిని అమలు చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారనే టాక్ మొదలైంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతూనే.. చర్చల కోసం బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ కోరడం మరో కీలక పరిణామం.
పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మమూ పాటించని వాడే చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్, చంద్రబాబు పొత్తులో ఉన్నా ఎవరి దారి వారిదే అని మరో మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇద్దరూ చివరి వరకు పొత్తులో ఉంటారనేది అనుమానమే అన్నారు. అయితే తనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారని.. జనసేన నేతల్లో వ్యతిరేకతను చల్లార్చేందుకే అభ్యర్థుల ప్రకటన డ్రామా ఆడారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..