
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవేల పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అనేక జాతీయ రహదారులు రాష్ట్రం గుండా వెళుతుండగా.. ఇప్పుడు మరికొన్ని రహదారుల పనులు షురూ అయ్యాయి. అందులో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుండగా.. దీని రాకతో ఏపీ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక, ఏపీని ఈ హైవే కలపనుంది. అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తు్న్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. వచ్చే ఏడాది నాటికి పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి.
ఆరు లైన్లతో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. దీనికి 544జీగా నామకరణంగా చేశారు. కర్ణాటక, ఏపీని ప్రధాన నగరాల గుండా ఇది వెళుతుంది. మధ్యలో జంక్షన్లు, వంతెలనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు ప్యాకేజీలుగా దీనిని విభజించి నిర్మిస్తున్నారు. 620 కిలోమీటర్ల మేర ఇది ఉండనుండగా.. దాదాపు రూ.19 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏపీలోని 8 జిల్లాల గుండా ఈ హైవే వెళుతుండగా.. దాదాపు 450 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో విస్తరించి ఉండనుంది. ఏపీ, కర్ణాటకలో మొత్తం 11 జిల్లాలను ఇది కవర్ చేస్తోంది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఈ హైవేలో ప్రయాణించవచ్చు. ఇప్పటికే అన్ని ప్యాకేజీల్లో దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 40 శాతం పనులు వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక హైవే పూర్తయితే కేవలం 6 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేసుకోవచ్చు. అత్యంత వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ప్రయాణ సమయం సగానికి సగం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. బైకులు, ట్రాక్టర్లు, ఆటోలు వంటి వాటికి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో అనుమతి లేదు. ఇక వాహనాలు ఎక్కబపడితే అక్కడ హైవేలోకి రావడానికి కుదరదు. కేవలం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. 40 కిలోమీటర్లకు ఒక జంక్షన్ ఉంటుంది. వాహనాలు ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీ వసూలు చేస్తారు. ఇక ప్రకాశం జిల్లాలో 110 కిలోమీటర్ల మేర హైవే విస్తరించి ఉండనుంది. మొత్తం 43 గ్రామాల మీదుగా వెథుతుంది. ప్రకాశం జిల్లాలో 10 వంతెనలు, 28 కల్వర్టులు, 48 చిన్న వంతెనలు ఉంటాయి. ఇక 28 అండర్‌పాస్‌లు, ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. ఇక గ్రామాల్లోకి వెళ్లేలా 127 బాక్స్ టైప్ అండర్‌పాస్‌లు ఉంటాయి.