Nadendla Manohar: భారతీయ జనతా పార్టీతో జనసేనా పొత్తుపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. తాము బీజేపీతో కలిసే ఉన్నామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ స్టాండ్ ప్రకారమే బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు. ఇందులో భాగంగానే బద్వేల్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సహకరిస్తామని నాదెండ్ల తేల్చి చెప్పారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని నాదెండ్ల ప్రశ్నించారు. రైతులను ప్రతీ విషయంలో ప్రభుత్వం మభ్యపెడుతూ మోసం చేస్తోందని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.