Inspiring Story: డాక్టరేట్‌ సాధించిన ఆటో డ్రైవర్‌..! జీవనోపాధి కోసం ఆటో నడుపుతూ.. డాక్టరేట్‌ అందుకున్న శంకర్‌ రావు!

గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్ గండికోట శంకర్ రావు, కాలికట్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆర్థిక శాస్త్రంలో అంతర్జాతీయ వాణిజ్యంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. తన కొడుకును స్కూలుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఆలోచన వచ్చింది. తోటి ఆటో డ్రైవర్లు ఆయనను ఘనంగా సత్కరించారు.

Inspiring Story: డాక్టరేట్‌ సాధించిన ఆటో డ్రైవర్‌..! జీవనోపాధి కోసం ఆటో నడుపుతూ.. డాక్టరేట్‌ అందుకున్న శంకర్‌ రావు!
Shankar Rao

Edited By: SN Pasha

Updated on: Apr 20, 2025 | 7:40 PM

ఆయన పేరు గండికోట శంకర్ రావు.. గుంటూరులోని నగర ఆటో డ్రైవర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నగరంలోనే ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నారు. అయితే తన కొడుకును స్కూలుకు తీసుకెల్తున్న సమయంలో ఆయనకు పీహెచ్‌డీ చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే అది ఎక్కడ చేయాలన్న ప్రశ్న ఎదురైంది. చాలా ఆలోచించి కాలికట్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగానే ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించాలని నిర్ణయానికి వచ్చారు.

అయితే గుంటూరుకు చెందిన శంకర్ రావు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకుంటూ వచ్చారు. 1999లో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేవి ఫలించలేదు. కొన్నేళ్లకు గుంటూరుకే చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్ గా మారారు. ఆటో నడుపుకుంటూ కటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కొడుకును బడి తీసుకెళ్లి వస్తుండగా పీహెచ్‌డీ చేయాలన్న ఆలోచన వచ్చింది. 2019లో ఎంఫిల్ ఫూర్తి చేశారు. ఆ తర్వాతే కాలికట్ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పూర్తి చేశారు.

చేయాలన్న సంకల్పం ఉంటే ఏ వయస్సులోనైనా చదువుకోవచ్చని, ఉన్నత చదువుల్లో రాణించవచ్చని శంకర్ రావు అంటున్నారు. అయితే తమతో పాటు ఆటో నడుపుకునే డ్రైవర్ పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ అందుకున్న విషయం తెలిసి తోటి ఆటో డ్రైవర్లు శంకర్‌ రావును ఘనంగా సన్మానించారు. గుంటూరు సీఐటీయూ కార్యాలయంలో ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయన సన్మాన కార్యక్రామాన్ని నిర్వహించారు. ఇటువంటి వ్యక్తులు ఎంతో మందికి స్పూర్తినిస్తారన్నారని వక్తలు అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి