ఆంధ్రప్రదేశ్‌లోని నెట్‌వర్క్ ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ CEO చర్చలు మరోసారి విఫలమయ్యాయి. మార్చి 31 వరకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేస్తేనే ఆరోగ్య శ్రీసేవలు అందిస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు స్పష్టం చేశాయి. అయితే.. ఏపీ ప్రభుత్వం 203 కోట్లు విడుదల చేయగా.. తక్షణం 800 కోట్ల బకాయిలు చెల్లించాలని పట్టుబడుతున్నాయి. ఇక.. రెండో దశ చర్చల విఫలం తర్వాత ఆరోగ్యశ్రీ సీఈవోకి నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ అమలు చేయాలంటే తక్షణమే 800 కోట్లు విడుదల చేయాలని కోరింది. 1500 కోట్ల బకాయిల్లో 800 కోట్లు చెల్లిస్తేనే సేవలు అందిస్తామని స్పష్టం చేశాయి. ఇప్పటికే.. 8 నెలల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రభుత్వం రిలీజ్ చేసిన 203 కోట్ల రూపాయలు కనీసం ఒక్క నెల బిల్లు కూడా కాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే.. ఆరోగ్యశ్రీ సేవల కోసం జిల్లా సమన్వయకర్తలను బెదరించవద్దని చెప్పాలని విజ్ఞప్తి చేసింది.
ఇక.. ఏపీలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నేటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీకి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్..పెండింగ్ నిధులు విడుదల చేసే వరకు వెనక్కి తగ్గేదిలేదని తెలిపాయి. 1500 కోట్లకు పైగా ఆరోగ్య శ్రీ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఆ బిల్లులు చెల్లించే వరకు కొత్త కేసులు తీసుకోమని ప్రకటించాయి. దాంతో.. ఆరోగ్యశ్రీ సీఈవో నెట్‌వర్క్ ఆస్పత్రులతో నిన్న ఒకసారి.. ఇవాళ మరోసారి చర్చలు జరపగా విఫలం అయ్యాయి. రెండు దఫాల చర్చలు విఫలం కావడంతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.
ఇదిలావుంటే.. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బంద్ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కొత్త కేసులను అడ్మిట్ చేసుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కీలక ప్రకటన జారీ చేసింది.. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిస్తే ఆ ఆసుపత్రుపై చర్యలు తీసుకుంటామంటామని హెచ్చరించింది. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ కాకుండా చూడాలంటూ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ నిధులపై పట్టుపడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు నెట్ వర్క్ హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి.. అయితే.. 2023 -2024 లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,566,22 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రికి జమ చేశామని ట్రస్ట్ ప్రకటించింది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్లు విడుదల చేశామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేర్కొంది. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటి వరకు 366 కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రకటన విడుదల చేసింది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..