తిరుపతిలో అన్యమత ప్రచారం జరిగిందనే ఆరోపణల్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ సర్కార్ ఈ మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై వేటు వేసింది. తిరుమలలో ఆర్టీసీ బస్ టికెట్ లపై అన్యమత ప్రచారం జరిగిందనే విషయంపై చేపట్టిన శాఖపరమైన విచారణ తర్వాత నెల్లూరు జోన్ జోన్ స్టోర్స్ కంట్రోలర్ ఎం. జగదీశ్ బాబును సస్పెండ్ చేశారు. తిరుమలకు టిమ్ రోల్స్‌ను నిర్లక్ష్యంగా పంపిణీ చేసినట్టు రుజువు కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు వేటు వేశారు. ఎన్నికల సమయంలో కోడ్ అమల్లోకి రావడానికి ముందు ముద్రించిన టిక్కెట్లను జగదీశ్ బాబు.. ఆర్టీసీ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా టిమ్ రోల్స్‌ను పంపిణీ చేశారు. కోడ్ ముగిసిన తర్వాత కూడా అప్పటికే సరఫరా కాబడ్డ ఈ టిమ్ రోల్స్‌పై గత ప్రభుత్వానికి చెందిన పథాకాలు ఉన్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతందనే వార్త దావానంలా వ్యాప్తి చెంది మత విద్వేషాలకు కారణమైంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.