Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక విధానంలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇకపై ఖాళీలకన్నా 200 రెట్లు ఎక్కువ అభ్యర్థులు ఉన్నప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. చాలా పోస్టులకు ఒకే మెయిన్స్ పరీక్షతోనే ఎంపిక పూర్తవుతుంది. దీంతో నియామక ప్రక్రియ వేగవంతమవుతుందని, నిరుద్యోగుల ఖర్చు భారం తగ్గుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..
Andhra Government

Edited By: Ram Naramaneni

Updated on: Jul 31, 2025 | 6:07 AM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నిరుద్యోగులకు ప్రయోజనం కలిగేలా, నియామకాల్లో వేగం పెరిగేలా నూతన మార్గదర్శకాలతో ముందుకొచ్చింది. ఈ సంస్కరణలతో ఇకపై ఉద్యోగాలు తక్కువ సమయంలో భర్తీ అయ్యే అవకాశం ఉండగా, అభ్యర్థులు ఇబ్బందులు పడే పరిస్థితి తగ్గే అవకాశముంది.

స్క్రీనింగ్ విధానంలో కీలక మార్పు

ఇప్పటివరకు ఏపీపీఎస్సీ ప్రత్యక్ష నియామకాలలో అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం అనివార్యంగా పాటిస్తూ వచ్చింది. అయితే, దీన్ని ఇకపై రద్దు చేస్తూ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు గడిని పెంచుతూ, ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినపుడు మాత్రమే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలి అనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో చాలా పోస్టుల నియామకాలకు ఇకపై ఒక్క మెయిన్స్ పరీక్షతోనే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

ఒకే పరీక్షతో నియామకాలు

ఈ మార్పులు అమలులోకి వస్తే ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒకే పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దీనివల్ల పలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తి చేయగలిగే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులు మళ్లీ మళ్లీ పరీక్షలకూ, దరఖాస్తులకూ ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుండా ఊరట పొందుతారు. ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్‌వర్క్ కంటే ఇది సులభమైన, వేగవంతమైన విధానంగా భావిస్తున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులతో అమలులోకి

ఏపీపీఎస్సీ చేసిన ప్రతిపాదనల్ని పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త విధానం ఎకడమిక్‌గా, అడ్మినిస్ట్రేటివ్‌గా కూడా సుళువు కావడంతో భవిష్యత్‌లో మెజారిటీ ఉద్యోగ నియామకాలపై ఇది వర్తించే అవకాశముంది. నియామకాల్లో పారదర్శకత, వేగం, నాణ్యత పెరగనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సంస్కరణలతో రాష్ట్రంలో ఉన్న వేలాది మంది నిరుద్యోగుల ఆశలు మరింత బలపడే అవకాశం ఉంది. పరీక్షల ఒత్తిడిని తగ్గిస్తూ, అవకాశాలను విస్తృతంగా అందించే దిశగా ఇది ప్రభుత్వంచేసిన అడుగు.