Rain Alert: తుఫాన్ గండం..! ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Dec 12, 2024 | 12:43 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది.. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఈ అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరం వైపు కదులుతుండటంతో రానున్న మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..

Rain Alert: తుఫాన్ గండం..! ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Ap Rain alert
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది.. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఈ అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరం వైపు కదులుతుండటంతో రానున్న మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. కాగా.. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపుతోంది. తిరుపతి, తిరుమల సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షం పడుతోంది. ఆరణియార్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 280 అడుగులకు చేరింది.

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ.. వర్షాలకు వరి, బొప్పాయి, నిమ్మ రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు తిరుమలలోనూ భారీ వర్షం కురిసింది.

భారీ వర్షాలకు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రేణిగుంట మండలం అత్తూరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆత్తూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామాలకు సైతం రాకపోకలు బంద్ అయ్యాయి. పాముల కాలువ నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. దొమ్మరిపాలెం దగ్గర సున్నపు కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

గురువారం ఈ ప్రాంతాల్లో వర్షాలు..

ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

తమిళనాడులో భారీ వర్షాలు..

కాగా.. తుఫాన్ ప్రభావం తమిళ నాడుపై తీవ్రంగా కనిపిస్తోంది.. తమిళనాడు, పుదుచ్చేరిలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. తమిళనాడు లోని 17 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ.

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడులో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అరోవిల్లి , పుతురాయ్, వనూర్, కాలాపేట్‌, సోలైనగర్‌, అరణ్యకపురం ప్రాంతాల్లో వర్షాల కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో కూడా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం నుండే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురువనున్నాయి.

ఇప్పటికే గత నెలలో ఫేయింజల్‌ తుఫాన్‌తో అపారనష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరిగింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి , కోస్తాంధ్ర , రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..