AP Rains: ఏపీకి తప్పిన గండం.. బలహీనపడిన వాయుగుండం.. కానీ ఆ జిల్లాలకు రెండ్రోజులు భారీ వర్షాలు..

|

Nov 23, 2022 | 9:10 AM

నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో బలహీనపడి అల్పపీడనం కొనసాగుతోందని.. అక్కడి నుంచి పశ్చిమ వాయవ్య దిశగా..

AP Rains: ఏపీకి తప్పిన గండం.. బలహీనపడిన వాయుగుండం.. కానీ ఆ జిల్లాలకు రెండ్రోజులు భారీ వర్షాలు..
Ap Rains
Follow us on

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోందని.. అక్కడి నుంచి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఈ అల్పపీడనానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. అలాగే దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరోవైపు అల్పపీడనం ప్రభావంతో చెన్నై, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో తమిళనాడులోని 8 జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నెల్లూరు…చెన్నై సహా తీర ప్రాంత జిల్లాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈదురు గాలులతో తీరప్రాంతం చివురుటాకులా వణికిపోతోంది. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక చెన్నై నగరాన్ని సైతం భారీ వర్షం బెంబేలెత్తిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 48 గంటలపాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఏపీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

ఏపీలో ఆదివాసీ ప్రాంతాలు ఈ శీతాకాలం మరింత అందాలు సంతరించుకున్నాయి. అల్లూరి ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. దట్టంగా కురుస్తోన్న పొగమంచు…నేలపైకి దిగివస్తోన్న మేఘాలు…అందమైన సూర్యోదయాలు… ప్రకృతికి కొత్తరంగులద్దుతున్నాయి. అల్లూరి జిల్లా మినుములూరులో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. పాడేరు 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా కురుస్తున్న పొగ మంచులో… తెల్లవారుజామునుండే వంజంగి మేఘాల మధ్యనుంచి సూర్యోదయం తిలకించడానికి అల్లూరి అటవీ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..