
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 39లక్షల 81వేల 399 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ వివరాలు రావటానికి అవకాశం లేనివిగా అంటే.. అన్ కలెక్టబుల్‌గా మిగిలాయి. వీటిలో 14లక్షల పత్రాలు చనిపోయినవారికి సంబంధించినవి. 12లక్షలు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి. 7లక్షల మంది ఓటర్ల నుంచి పత్రాలను సేకరించేందుకు బీఎల్‌వోలు ప్రయత్నించినా వారు సంబంధిత చిరునామాల్లో అందుబాటులో లేకపోవటం, ఫోన్లకు స్పందించకపోవటంతో సాధ్యం కాలేదు. అన్ కలెక్టబుల్‌ను మినహాయిస్తే 3కోట్ల 69 లక్షల ఓటర్ల డిజిటైజేషన్ పూర్తయ్యాయి.
తిరుపతి, కడప, గుంటూరు వెస్ట్, కర్నూలు, కాకినాడ సిటీ, చంద్రగిరి, నెల్లూరు గ్రామీణం, గుంటూరు ఈస్ట్, కాకినాడ గ్రామీణ, నరసరావుపేట నియోజకవర్గాల్లో అన్ కలెక్టబుల్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్‌వోలకు సమర్పించడానికి ఇవాళే చివరి రోజు. ఇప్పటికీ మీ ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్‌వోలకు ఇవ్వకపోతే ఏమాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే సమర్పించండి. లేకపోతే జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో మీ పేరు ఉండదు. ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇప్పటికే బీఎల్‌వోలకు ఎన్యూమరేషన్ పత్రం సమర్పించి ఉంటే.. దాన్ని అధికారులు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి డిజిటైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్, వెబ్‌సైట్‌లోకి వెళ్లి పరిశీలించొచ్చు. మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నంబరు నమోదు చేస్తే చాలు డిజిటైజ్ అయ్యిందో లేదో తెలిసిపోతుంది.
అయితే.. ఇవ్వాల్టితో గడువు ముగియనున్న నేపథ్యంలో గడువును పెంచాలని పలు పార్టీల నేతల డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..