
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. వర్షాల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు సోమవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని తెలిపింది. మత్స్యకారులు కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
అటు తెలంగాణలో సైతం రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎండాకాలం ముగిసినా తగ్గని ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు ఇది కాస్త ఉపశమనాన్ని కల్పించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.