
ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలకు అవకాశముందని అంచనా వేసింది. కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి ఏర్పడగా.. ఇది మంగళవారం తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐద్రోజుల్లో భారీ వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని హెచ్చరించారు.
తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 19,20,21వ తేదీల్లో భారీ రెయిన్ లఅలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి భారీ వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశముందని స్పష్టం చేసింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మొన్నటివరకు వర్షాలు పడకపోగా.. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా రెండ్రోజుల పాటు వానలు దంచికొట్టాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీని వల్ల వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేసింది. వర్షాల క్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు తగ్గే అవకాశముందని తెలిపింది.
ఇక ఏపీలో ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు ఏపీలో కూడా గత కొద్దిరోజులుగా విస్తరంగా వానలు పడుతున్నాయి. దీంతో రైతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాబోయే కొద్ది రోజులు వానలు కొనసాగే అవకాశముంది.