Andhra Round Up 2024: : మలుపుతిప్పిన ఘటనలు.. మరిచిపోలేని సంఘటనలు

|

Dec 30, 2024 | 9:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనల్లో ఈ ఏడాది బాగా గుర్తుండిపోయిన సంచలనాత్మక అంశం ఏది అని అడిగితే ఏం చెబుతారు..! మైండ్‌లో ఓ సీన్‌ గుర్తొస్తోంది కదూ..! పొలిటికల్‌గా ఆలోచిస్తే.. ఓ ఘన విజయం, ఓ ఘోర పరాజయం. పొలిటికల్‌ తెరపై ఓ కొత్త స్టార్‌ ఆవిర్భావం, అన్నపైకే తిరిగిన ఓ బాణం. బెజవాడలో వరదలు, జత్వానీ కేసు సహా పలువురు వైసీపీ నేతలకు నోటీసులు, అరెస్టులు. ఇక తిరుమల లడ్డూ వివాదం.. దువ్వాడ-దివ్వెల వ్యవహారం. ఇలా.. 2024లో జరిగిన ఒక్కో సంఘటనను మరోసారి గుర్తు చేసుకుందాం..

Andhra Round Up 2024: : మలుపుతిప్పిన ఘటనలు.. మరిచిపోలేని సంఘటనలు
Andhra Round Up 2024
Follow us on

జనరల్‌గా 2024లో ఏపీ పాలిటిక్స్‌లో జరిగిన మార్పుల గురించి చెప్పుకోవాలంటే.. జనవరి నుంచి చెప్పుకోవాల్సిన పని లేదు. 2024 జూన్ 4. ఆ ఒక్క రోజు గురించి చెప్పుకుంటే చాలు. హైఓల్టేజ్‌తో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఒక ప్రభంజనమే సృష్టించింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 175 స్థానాల్లో 164 సీట్లను గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేసి 135 సీట్లు గెలిచింది. జనసేన పార్టీ 21 సీట్లలో పోటీ చేసి అన్ని సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 10 సీట్లలో పోటీ చేసి 8 సీట్లలో గెలిచింది. వైసీపీ మాత్రం 11 సీట్లకు పరిమితం అయింది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో అలాంటి విజయం బహుశా నభూతో నభవిష్యత్. వన్‌సైడ్‌ లవ్ టూసైడ్స్‌ అయింది. ఆ ఇద్దరి మధ్య ప్రేమను అంగీకరిస్తూ మరో సైడ్‌ బీజేపీ నిలబడింది. ఈ మూడు పార్టీల కూటమి గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చినా.. ఫిబ్రవరి వరకు తేలనేలేదు. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు కూటమి ఏర్పాటే జరగలేదు. ఇంకోవైపు వైసీపీ దూసుకెళ్తోంది. ఫేజ్‌-1, 2, 3 అంటూ ఫటాఫట్‌గా సీట్లు ప్రకటించేసి ప్రచారానికి కూడా వెళ్లింది. అక్కడ చూస్తేనేమో టీడీపీ-జనసేన-బీజేపీ పట్ల సీట్ల పంపకాలే పూర్తికాలేదు. ఆలస్యం అమృతం అవుతుంది కూడా. బహుశా అదే జరిగి ఉంటుంది. కూటమి కట్టారు ఎన్నికలకు వెళ్లారు.. ఓ ప్రభంజనమే సృష్టించారు. కుప్పం నుంచి 8వసారి గెలిచిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇక్కడ వైసీపీ ఎలక్షన్‌ స్ట్రాటజీని కూడా ఓసారి గుర్తుచేసుకోవాలి. మేమంతా సిద్ధం, సిద్ధం సభలతో దడదడలాడిస్తూ వెళ్లారు వైఎస్ జగన్. ఏ సభ పెట్టినా జనప్రభంజనమే ఆనాడు. పైగా వైనాట్-175, ‘ఫస్ట్ టార్గెట్ కుప్పం’ అనే థీమ్‌తో దూకుడుగా ప్రచారం చేశారు. హైఓల్టేజ్‌తో సాగుతున్న పోటాపోటీ ప్రచారంలో ఓ అనూహ్యమైన ఘటన. ఏప్రిల్‌ 13.. బెజవాడ శివారు.. సింగ్‌నగర్‌ డాబాకొట్ల రోడ్డు.. గుంపులో నుంచి వచ్చి వేగంగా వచ్చిన రాయి. వైఎస్‌ జగన్‌ నుదుటిపై బలమైన గాయం. ఆ ఒక్క వార్తతో తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. సాక్షాత్తు సీఎంపై దాడి చేయడం తెలుగురాష్ట్రాల్లో ఓ అనూహ్య ఘటన. 2019 ఎన్నికలప్పుడు కోడి కత్తితో దాడి, 2024 ఎన్నికల్లో మళ్లీ అలాంటి దాడే.

రాయి దాడి ఘటనను మరిచిపోడానికి ఎంతో సమయం పట్టలేదు. పోలింగ్‌ సందర్భంగా జరిగిన హింస అంతాఇంతా కాదు. మే 13న మొదలైన హింస.. ఎన్నికల ఫలితాల తరువాత మరోసారి రాజుకుంది. దేశంలో ఎక్కడా లేనంతగా ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది ఏపీలో. అదే రోజున ఈవీఎం పగలగొట్టడం.. అందులోనూ మాచర్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆ పని చేయడం.. అప్పట్లో సంచలనం సృష్టించింది. క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్‌ అనే ఓటరుపై ఎమ్మెల్యే శివకుమార్‌ దాడి చేయడం, దానికి ఓటరు కూడా ప్రతిదాడి చేయడం ఓ సెన్సేషన్. ఇక పల్నాడు జిల్లాలో బాంబులు, నాటుబాంబులు బయటపడడంతో పోలింగ్‌ ముగిసిన 15 రోజుల దాకా కేంద్ర బలగాలను అలర్ట్‌గా ఉంచాల్సి వచ్చింది.

మొత్తానికి జూన్‌ 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. మధ్యాహ్నానికి ఆ నెంబర్స్‌ చూసి ప్రతి ఒక్కరూ షాక్. ఓడిపోవచ్చు గాక.. కాని మరీ ఇంత దారుణంగానా అని వైసీపీ వాళ్లు. గెలుస్తామనే ధీమా ఉంది గానీ మరీ ఇంత మెజారిటీ ఊహించలేదని టీడీపీ వాళ్లు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. మామూలు గెలుపు కాదది.. ఎన్డీయే కూటమిలోనే రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. ఇక జనసేన అయితే.. హండ్రెడ్‌ పర్సెంట్‌ స్ట్రైక్‌ రేట్. దేశ ఎన్నికల చరిత్రలో ఇదో చరిత్ర. గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీని గెలవనివ్వబోనన్న పవన్‌ శపథం, వైసీపీని ఓడిస్తానన్న ఛాలెంచ్‌ ఫలించిన రోజు అది.

151 సీట్లు గెలుచుకోవడం ఒక చరిత్ర. అలాంటి వైసీపీ 11 సీట్లకు పడిపోవడం కూడా ఓ సరికొత్త చరిత్రే. అక్కచెల్లెమ్మల ప్రేమ ఏమైపోయిందో అంటూ వైఎస్‌ జగన్‌ మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి చాలామందికి.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పొలిటికల్‌ స్క్రీన్‌పై తిరుగులేని నేతగా ఆవిర్భవించిన పవన్ కల్యాణ్‌ గురించే. ఎన్నెన్ని అవమానాలో, ఎన్నెన్ని ఎదురుదెబ్బలో. పదేళ్ల రాజకీయంలో పెద్ద యుద్ధమే చేశారు పవన్ కల్యాణ్. ఓటమి తరువాత వచ్చే గెలుపు రుచే వేరు. ‘యే పవన్‌ నహీ.. ఆంధీ హై’.. పవనం కాదది.. తుఫాన్‌ అంటూ ప్రధాని మోదీ పలికిన మాటలు అక్షరసత్యం. దత్తపుత్రుడు అని, రాజీపడ్డారని, జనసేనను నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని ఎవరెన్ని మాటలు అన్నా.. అవన్నీ ఒకే ఒక్క విజయంతో తుడుచుపెట్టుకుపోయాయి. ఈ ఎన్నికల్లో పవన్‌ను ఎవరెవరు, ఎలాంటి పదజాలంతో విమర్శించారో.. ఇకపై అలాంటి మాటలు వచ్చే ఎన్నికల్లో వినిపించకపోవచ్చు. అంత సౌండ్‌తో విజయఢంకా మోగించారు పవన్ కల్యాణ్. పిఠాపురం తాలూకా అని సగర్వంగా చెప్పుకునేలా ఆ నియోజకవర్గం నుంచి 70వేల ఓట్ల మెజారిటీతో గెలిచి, డిప్యూటీ సీఎం అయ్యారు.

అటు బీజేపీకి దక్కిన విజయం కూడా సామాన్యమేం కాదు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో గట్టి ప్రాతినిథ్యమే దక్కింది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది షర్మిల గురించి. తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. జనవరి 21 ఏపీ పీసీసీ చీఫ్‌ బాధ్యతలతో మళ్లీ సొంత గడ్డపై అడుగుపెట్టారు. ప్రతిపక్షం ఏదైనా.. అప్పటి పాలకపక్షాన్నే విమర్శించాలి. అదే పనిచేశారు వైఎస్ షర్మిల. కాకపోతే.. అదో కుటుంబ గొడవగా డైవర్ట్‌ అయిందంటారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ వివేకా హత్య విషయంలో న్యాయం చేయాలంటూ కొంగుచాచి అడగడం.. ఒకరకంగా వైసీపీని దెబ్బతీసిందని చెబుతారు. అప్పటికే, తన కుమారుడి పెళ్లికి వైఎస్ జగన్‌ను షర్మిల పిలవడం, ఆయన వెళ్లకపోవడం, ఎన్నికల తరువాత కూడా ఆస్తుల పంపకాలపై ఫైట్‌ జరగడం.. ఓవరాల్‌గా అన్నాచెల్లెళ్ల గొడవ ఈ ఏడాదిలో చెప్పుకోవాల్సిన ఓ మోస్ట్‌ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌గా మారింది. దానికి తోడు అమెరికాలో అదానీపై కేసు నమోదుచేయడం.. ఆ ఇష్యూకు అప్పటి జగన్ ప్రభుత్వానికి లింక్‌ చేయడం కూడా ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్ అయింది.

ఈ ఏడాది అందరి నోళ్లలో నానిన మరో అంశం.. నారా లోకేశ్‌ రెడ్‌బుక్‌. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రతిపక్షం ఎంత కామెంట్‌ చేసినా.. రెడ్‌బుక్‌లో చాప్టర్-3 తెరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు. అసలు ఎన్నికల ప్రచారంలోనే దాన్ని హైలెట్‌ చేశారు నారా లోకేష్. తాను రెడ్‌బుక్‌ చూపించి ప్రచారం చేసిన ప్రతిచోట గెలిచానంటూ జస్టిఫై చేసుకున్నారు కూడా. కాని, లోకేశ్‌ రెడ్‌బుక్‌పై ఆగస్ట్‌లో మొదటిసారి విరుచుకుపడ్డారు వైఎస్ జగన్.

ఈ ఏడాదిలో ఏపీలో జరిగిన సంఘటనలు అంటే.. బాగా గుర్తొచ్చేవి రాజకీయాలే. కాని, కొన్ని విషాదాలు, ఇంకొన్ని వివాదాలు, మరికొన్ని కీలక పరిణామాలు చాలా ఉన్నాయి. ఆ డిటైల్స్‌ తెలుసుకుందాం… 

2024ను రెండు ఎపిసోడ్లుగా చూడాల్సి వస్తే.. కూటమి అధికారంలోకి రాక ముందు, కూటమి అధికారంలోకి వచ్చాక అని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.. అందరూ ఆసక్తిగా ఎదురుచూసింది వాలంటీర్ల వ్యవస్థ గురించే. ఆ విషయంపై ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా.. సైలెంట్‌గా ప్రభుత్వ అధికారులతోనే పెన్షన్లు ఇప్పించడం మొదలుపెట్టించారు సీఎం చంద్రబాబు. అది బిగ్గెస్ట్‌ హిట్. వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా.. ప్రభుత్వ పథకాలు, జరగాల్సిన పనులు ఆగబోవనే సందేశం ఇచ్చిన సందర్భం అది.

ఈ ఏడాది ఏపీలో జరిగిన అత్యంత ఘోర విషాదం.. బెజవాడ వరదలు. ఆగస్ట్‌లో రెండు వారాలపాటు కురిసిన వర్షాలకు బుడమేరు గట్టు తెంచుకుని విజయవాడలో జలప్రళయం సృష్టించింది. బెజవాడ చరిత్రలోనే మరిచిపోలేని ఓ పీడకల అది. వెంటనే అలర్ట్‌ అయిన సీఎం చంద్రబాబు.. వర్షంలో, వరదలో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందే వరకు, వరద పూర్తిగా తగ్గే వరకు విజయవాడలోనే ఉన్నారు. బుడమేరు గండ్లు పూడ్చివేయించేందుకు మంత్రి రామానాయుడు పడిన కష్టం, రాత్రిపగలు తేడా లేకుండా మంత్రులు, అధికారులు పనిచేసిన తీరును మరోసారి గుర్తు తెచ్చుకోవాలి.

దేశం మొత్తం ఉలిక్కిపడిన ఘటన.. ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆందోళన చెందిన అంశం.. తిరుమల లడ్డూ వివాదం. భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలను జంతువుల కొవ్వు అవశేషాలున్న కల్తీ నెయ్యితో తయారుచేశారన్న సీఎం చంద్రబాబు స్టేట్‌మెంట్‌ ప్రకంపనలు పుట్టించింది. ల్యాబ్‌ పరీక్షల్లో సైతం ఈ విషయం బయటపడడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జగన్‌ హయాంలోనే ఇది జరిగిందంటూ కూటమి నేతలు విమర్శించడంతో వైఎస్‌ జగన్‌.. దీన్ని డిఫెండ్‌ చేసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. సెప్టెంబర్‌ మొత్తం తిరుమల లడ్డూ వివాదమే హైలెట్‌ అయింది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో సిట్‌ వేశారు.

ముగ్గురు ఐపీఎస్‌లను.. ఒకే కేసు వ్యవహారంలో సస్పెండ్‌ చేయడం దేశచరిత్రలో మొదటిసారి. ఏపీలో జరిగిన ఈ పరిణామం జాతీయ స్థాయిలో ఓ సంచలనం. ఆ కేసు.. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ కేసు తాలూకు వివరాలు.. ఎన్నికల ఫలితాల తరువాత.. కూటమి అధికారంలోకి వచ్చాక బయటపడ్డాయి. చివరికి సెప్టెంబర్ 5న ఈ కేసులో కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్‌ చేశారు.

రుషికొండ భవనం. నేషనల్‌ మీడియాలో సైతం పెద్ద డిబేట్ జరిగింది వీటి నిర్మాణాల గురించి. జగన్ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి.. దాదాపు 409 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాల గురించి ఎన్నికల ఫలితాలు వచ్చిన నెక్ట్స్‌ డే నుంచే డిస్కషన్‌ జరిగింది. అప్పటి వరకు ఆ భవనాల దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రానివ్వలేదు. కూటమి వచ్చాక.. అందులో ఏముందో ప్రపంచానికి చూపించాక.. అంతా నోరెళ్లబెట్టడమే కనిపించింది. బాత్‌రూమ్‌ కమోడ్‌ 11 లక్షలు, తలుపులకు 31 లక్షల 84 వేలు, ఒక్కో వాష్‌బేసిన్‌కు 2 లక్షలు, ఒక్క టేబుల్‌ ఖరీదు 53 లక్షలు.. ఇలా అన్నింటి ఖర్చు లక్షలకు లక్షలు ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీన్ని ఏం చేయాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు కూటమి ప్రభుత్వానికి.

అప్పటి వరకు సజావుగా సాగుతున్న కూటమిలో ఓ ఝలక్. ఎవరి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నుంచి. ‘తానే హోంమంత్రిని అయితే గనక’ అంటూ చేసిన కామెంట్లు నిజంగా ప్రకంపనలు పుట్టించాయి. అప్పటి నుంచి సరికొత్త అధ్యాయం మొదలైంది. వైసీపీ నేతలపై కేసులు, ముఖ్య నేతలకు నోటీసులు వెళ్లాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన కామెంట్లు పెట్టిన వారి అరెస్టులు జరిగాయి. 49 మంది అరెస్టులు, 147 కేసులు, 650కి పైగా నోటీసులు వెళ్లాయి ఈ ఇష్యూలో. సజ్జల భార్గవ్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి.. ఇలా కీలక నాయకులు, వ్యక్తుల పేర్లు కూడా వినిపించాయి. ఇక జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారి అరెస్టులు, కీలక నేతలకు నోటీసులు.. ఇలా వరుస పరిణామాలు జరిగాయి. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, నందిగం సురేశ్.. ఇలా ఒక్కొక్కరిపైనా యాక్షన్‌లోకి దిగింది కూటమి ప్రభుత్వం.

సీజ్‌ ద షిప్. మోస్ట్ పాప్యులర్ డైలాగ్‌ ఆఫ్‌ ది ఇయర్. ఏపీలో రేషన్‌ మాఫియా దందా ఏ రేంజ్‌లో ఉందో చూపిన ఘటన అది. పేదవాళ్లకి అందాల్సిన బియ్యాన్ని ఏకంగా ఆఫ్రికాకు తరలించేందుకు ప్రయత్నించడంతో.. స్వయంగా పవన్‌ కల్యాణే రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టుకు వెళ్లి మరీ ‘సీజ్ ద షిప్’ అంటూ ఆదేశాలిచ్చారు. షిప్‌లోకి వెళ్లిన రీసైకిల్డ్‌ రేషన్‌ బియ్యం అన్‌లోడ్‌ అయ్యేంత వరకు ఆ షిప్‌ను కదలనివ్వలేదు. ఈ కేసులో వైసీపీ నాయకులపై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది.

కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని సంఘటనలను కచ్చితంగా చెప్పుకోవాలిక్కడ. ప్రభుత్వ కార్యాలయాల్లో కీలకమైన ఫైల్స్‌ దగ్ధం అవడం సంచలనం సృష్టించింది. ఏదో ఒకసారంటే ప్రమాదం అనుకోవచ్చు. కాని, వరుసపెట్టి జరిగాయి ఆ ఘటనలు. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరువాత విజయవాడలోని సీఐడీ కార్యాలయం వద్ద పైళ్లు కాల్చివేయడం కనిపించింది. ఆ వెంటనే పోలవరం భూసేకరణ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన జరిగింది. ప్రస్తుతానికి ఈ ఫైల్స్‌ దగ్ధం కేసులపై విచారణ జరుగుతోంది. విచారణ ఓ కొలిక్కి వచ్చాక.. సంచలనాలు జరగొచ్చనే వాదన వినిపిస్తోంది.

ఇక.. కొన్ని పాజిటివ్‌ అంశాల గురించి చెప్పుకుందాం. వచ్చే పాతికేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉండాలన్న దానిపై ఓ డాక్యుమెంట్‌ రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు. విజన్-2047 టార్గెట్‌గా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. వాటిని సాకారం చేసేందుకు ఓ ప్రణాళిక విడుదల చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల రీఓపెనింగ్‌ ఓ పండుగలా జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకున్నాయి.

AP. A ఫర్ అమరావతి, P ఫర్ పోలవరం. డెఫినేషన్‌కు తగ్గట్టే ఈ రెండింటినీ పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. ఏకంగా 60వేల కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాలతో అమరావతికి ఓ రూపు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆల్రడీ వరల్డ్‌ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి 15వేల కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తామంటూ స్వయంగా కేంద్రమే పార్లమెంట్‌లో ప్రకటించింది. అనౌన్స్‌ చేసినట్టుగా.. రుణం కూడా మంజూరైంది. సో, సంక్రాంతి తరువాత నుంచి అమరావతిలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలన్నీ ఒకేసారి మొదలుకాబోతున్నాయి. వచ్చే మూడేళ్లలో అమరావతి ‘ఆల్‌మోస్ట్‌ ఫినిష్డ్‌’ స్టేజ్‌లో ఉండేలా చూడాలనేది సీఎం చంద్రబాబు టార్గెట్‌. అందుకు తగ్గట్టే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక పోలవరం. ఈ భారీ ప్రాజెక్టును కూడా 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్రం ఓ టార్గెట్‌ ఫిక్స్ చేసింది. కాని, సీఎం చంద్రబాబు మాత్రం 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటూ కొత్త టార్గెట్‌ ఫిక్స్ చేశారు. 2025 డిసెంబర్‌ నాటికి డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేయాల్సిందేననే టార్గెట్ పెట్టారు. సో, ఎట్టిపరిస్థితుల్లో కూటమి హయాంలోనే ప్రాజెక్ట్‌ పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు సీఎం చంద్రబాబు.

ఇన్ని చెప్పుకున్నాక.. రామ్‌గోపాల్‌ వర్మ కేసు గురించి చెప్పుకోకపోతే ఎలా? ఈ ఇయర్‌ బాగా ట్రెండ్‌ అయిన సబ్జెక్ట్‌ కూడా. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేశారంటూ రాంగోపాల్‌ వర్మపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ స్వయంగా పోలీసులే వెళ్లి నోటీసులు ఇచ్చినా సరే.. విచారణకు వెళ్లలేదు. దీంతో ఏ నిమిషంలోనైనా వర్మ అరెస్ట్ జరగొచ్చనే వార్తలు రావడంతో.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ పుకార్లు వినిపించాయి. తీరా చూస్తే.. ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించారు.

ఆఖరుగా చెప్పుకోవాల్సింది దువ్వాడ-దివ్వెల వ్యవహారం. ఈ కుటుంబ కథా చిత్రానికి వచ్చినంత హైప్‌ మరో ఇష్యూకు రాలేదనే చెప్పాలి. హైలెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అనే అవార్డ్‌ ఎవరికి ఇవ్వాలనే పోల్‌ పెడితే.. దువ్వాడ-దివ్వెల ఇష్యూకే ఓటేస్తారనుకుంటా జనం. తమను వదిలేసి.. దివ్వెల మాధురితో తమ తండ్రి ఉంటుంన్నారంటూ దువ్వాడ ఇద్దరు కూతుళ్లు రోడ్డెక్కడం, దువ్వాడ సతీమణి వాణి ధర్నా చేయడం స్టేట్‌వైడ్‌ హల్‌చల్‌ చేసింది. కొన్ని రోజుల పాటు ఆ ఇష్యూ నడిచింది. ఇక అంతా సద్దుమణిగినట్టే అనుకున్న సమయానికి.. దువ్వాడ-దివ్వెల కలిసి తిరుమల వెళ్లడం ఈ ఇష్యూ మరో కీ-టర్న్‌ తీసుకుంది. పోనీ అక్కడితో ఆగారా అంటే.. పవిత్రమైన తిరుమలలో ఇద్దరూ రీల్స్‌ తీసుకుని అందరి నోళ్లలో నానారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి