
మన ఊళ్లలో, నగరాల్లో ప్రయాణించేటప్పుడు రోడ్డుపై ఒక చిన్న గుంత కనిపిస్తే చాలు.. వాహనదారులు వామ్మో అని జంకుతారు. సాధారణంగా ఒక చిన్న గుంత పడితే, దాన్ని పూడ్చడానికి ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు కదలాలి, టెండర్లు పడాలి.. ఈ లోపు ఆ గుంత కాస్తా పెద్ద లోయలా మారి ప్రాణాల మీదకు తెస్తుంది. కానీ ఇకపై ఏపీ ప్రజలకు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతికతతో, కేవలం గంట వ్యవధిలోనే రోడ్డుపై ఉన్న గుంతలను స్పాట్‌లోనే క్లియర్ చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఊపందుకుంటోంది. అదే రోడ్ డాక్టర్.. సాధారణంగా ఒక రోడ్డు పాడైతే, దాన్ని బాగు చేయడానికి ఇంజనీర్లు ప్లాన్ గీసి, టెండర్లు పిలిచి, పనులు మొదలుపెట్టేసరికి కనీసం మూడు నెలల సమయం పట్టేది. కానీ ఈ రోడ్ డాక్టర్ మొబైల్ వాహనంతో ఆ పాత పద్ధతులకు చెక్ పడింది. రోడ్డుపై ఎక్కడైనా గుంత పడిందని సమాచారం రాగానే, ఈ ప్రత్యేక వాహనం సిబ్బందితో సహా అక్కడికి చేరుకుంటుంది. ఎలాంటి జాప్యం లేకుండా ఆ గుంతను శుభ్రం చేసి, క్షణాల్లో మెటీరియల్ మిక్స్ చేసి రోడ్డును మునుపటిలా మార్చేస్తుంది. ఈ కొత్త విధానంలో వాహనాన్ని మెయింటైన్ చేయడం, గుంతలు పూడ్చడం అంతా కాంట్రాక్టర్లదే బాధ్యత కాబట్టి ప్రభుత్వానికి కూడా పనుల నాణ్యతపై నిఘా పెట్టడం సులువైంది.
ఈ రోడ్ డాక్టర్ వెహికల్స్ పనితీరు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రోడ్డుపై రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు ఉన్న పెద్ద గుంతను కూడా కేవలం 45 నుంచి 60 నిమిషాల లోపే పూర్తిగా పూడ్చేస్తారు. ఈ వాహనంలోనే కంకర, మెటల్, వేడి తారు మిశ్రమం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. గుంత ఉన్న చోట క్లీన్ చేసి, ఈ మిశ్రమాన్ని వేసి రోలర్‌తో సమానంగా నొక్కేస్తారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే మెయిన్ రోడ్లపై రాత్రి వేళల్లో, మిగతా చోట్ల పగటిపూట ఈ పనులను చకచకా కానిచ్చేస్తున్నారు.
ఈ సరికొత్త ప్రయోగం వల్ల కేవలం సమయం మాత్రమే కాదు.. ప్రజా ధనం కూడా భారీగా ఆదా అవుతోంది. గతంలో సాంప్రదాయ పద్ధతిలో ఒక గుంతను పూడ్చడానికి సగటున రూ.4,000 ఖర్చయ్యేది. పైగా రోజులు గడిచిపోయేవి. కానీ ఈ మొబైల్ వాహనాల ద్వారా అదే పనిని మరింత నాణ్యంగా.. కేవలం రూ.3,000 ఖర్చుతోనే పూర్తి చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ వేగంతో పనులు అవుతుండటంతో అటు అధికారులకు, ఇటు ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.
మొదటగా తాడేపల్లి-మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాలతో దీన్ని తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి మరో ఐదు నగరాలకు విస్తరించారు. ఇప్పటివరకు ఈ నగరాల్లో ఏకంగా 16,918 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 8,457 గుంతలను రోడ్ డాక్టర్ విజయవంతంగా పూడ్చేసింది. ఈ సక్సెస్ చూశాక, రాష్ట్రంలోని మరో 12 నగరాల్లో కూడా ఈ మొబైల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఏపీ నగరాలన్నీ గుంతలు లేని రోడ్లతో మెరిసిపోనున్నాయి.