ఏపీకి ఇంకా వర్ష ముప్పు వీడలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఎందుకంటే..తమిళనాడులో వాయుగుండం బలహీనపడింది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్నాటక ప్రాంతాల్లో.. ఈ వాయుగుండం అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అటు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ 4 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రాయలసీమపై దండెత్తిన వర్షం
ఊహకందని విధ్వంసం. గత నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడని జలప్రళయం. అవును, రాయలసీమపై దండెత్తింది మామూలు వర్షాలు కాదు. రాయలసీమ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో విరుచుకుపడిన జలఖడ్గం అది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో నమోదైన రెయిన్ ఫాల్ రికార్డ్స్ ఈ జల విధ్వంసానికి సాక్షిగా మారాయ్. గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ మూడు జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. ఏ ప్రాంతంలో చూసినా సగటున వంద మిల్లిమీటర్లపైనే వర్షం పడింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా కుండపోత దంచికొట్టింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 540.6 మిల్లిమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. ఏరియా వైజ్ నమోదైన వర్షపాతాలు ఇలాగున్నాయ్. ఎన్పీ కుంటలో 237.2 మిల్లిమీటర్లు, నల్లచెరువులో 185.2 మిల్లిమీటర్లు, కదిరిలో 138.6 మిల్లిమీటర్లు, చిత్తూరులో 113 మిల్లిమీటర్లు, చంద్రగిరిలో 96 మిల్లిమీటర్లు, శ్రీకాళహస్తిలో 94 మిల్లిమీటర్లు, రొంపిచర్లలో 93 మిల్లిమీటర్లు, యాదమర్రిలో 91.75 మిల్లిమీటర్లు, రేణిగుంటలో 90 మిల్లిమీటర్లు, పలమనేరులో 79 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వరుణుడు సృష్టించిన బీభత్సం ఊహకందనివిధంగా ఉంది. ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా గ్రామాలకు గ్రామాలే కనుమరుగయ్యేంతగా వరద ముంచెత్తింది. ఊహకందనివిధంగా విరుచుకుపడిన జల విలయానికి జనజీవనం కకావికలమైంది. కళ్లు మూసి తెరిచేలోపే పెను విధ్వంసం జరిగిపోయింది. అలర్ట్ అయ్యేలోపే గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి.
కడప, అనంతపురం, చిత్తూరు ఈ మూడు జిల్లాల్లో ఎక్కడ చూసినా వరద బీభత్స భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయ్. కుండపోత అయితే ఆగింది, కానీ తీరని గుండెకోత మిగిల్చి వెళ్లింది. వరద ముంపు ప్రాంతాల్లో అడుగడుగునా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయ్. ఆప్తుల్ని కోల్పోయిన ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: తుఫాన్‌లు ఎలా ఏర్పడతాయి? అల్పపీనడం, వాయుగుండం మధ్య తేడా ఏంటి.. తీరం దాటడం అంటే?
చిత్తూరు జిల్లాలో వరుణుడి ప్రకోపం.. కుంభవృష్టి.. విద్యాసంస్థలకు సెలవు