‘అహనా పెళ్లంట’ కోడి సీన్.. విశాఖలో రియల్‌గా రిపీట్..! ఎందుకో తెలుసా?

విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నిత్యావసర ధరల పెరుగుదలపై వినూత్న నిరసన చేపట్టారు. 'అహనా పెళ్ళంట' చిత్రంలోని కోడి సీన్‌ను రీల్ నుండి రియల్‌కి తెచ్చి, ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని ప్రదర్శించారు. తెలంగాణాతో పోలిస్తే ఏపీలో అధిక ధరలు ఉన్నాయని చూపుతూ, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు. ఈ నిరసన సామాన్యుల కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపింది.

‘అహనా పెళ్లంట’ కోడి సీన్.. విశాఖలో రియల్‌గా రిపీట్..! ఎందుకో తెలుసా?
Visakhapatnam Protest

Edited By:

Updated on: Sep 02, 2026 | 8:52 AM

‘అహనా పెళ్ళంట’ చిత్రంలో కోట శ్రీనివాసరావు చేసిన అయ్యప్ప పాత్ర, అందులోని కామెడీ సన్నివేశాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈ సినిమాలో.. అస్తమానం ఖర్చులకు వెనుకాడే లోభి పాత్రలో అద్భుతంగా నటించారు కోటా. ఆయన చేసే ప్రతి చిన్న పనిలోనూ, మాటల్లోనూ ఉండే లోభితనం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ చిత్రంలోని కామెడీ సీన్లు మరియు కోట శ్రీనివాసరావు అభినయం టాలీవుడ్‌లో ఒక బెంచ్‌ మార్క్‌గా నిలిచాయి.

అందులో అన్నిటికంటే ఫేమస్ కోడి సీన్. చికెన్ తినాలనే ఆశను.. కోడిని వేలగట్టుకుని దాన్ని చూస్తూ భోజనం చేయడం లాంటి సన్నివేశం అందరిని కట్టిపడేయడమే కాదు.. ఆలోచింపజేసింది. అది రీల్ సీన్.. కానీ.. విశాఖలో రియల్ సీన్ మరోసారి అందరినీ ఆలోచింపజేసింది. ఈసారి విశాఖలో చేసిన ఈ కోడి సీన్.. లోబీ పాత్ర కోసం కాదు. నిత్యవసరల ధరల పెరుగుదలతో ఏపీలో జనం పడుతున్న ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో చూపించిన అటువంటి సీన్.. ఇప్పుడు కళ్ళ ముందు కనిపించడంతో అందరూ ఒకింత ఆసక్తిగా.. ఆశ్చర్యంగా చూశారు.

అసలు విషయం ఏంటంటే.. విశాఖలో సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఏది చేసినా డిఫరెంట్. పొగడ్తలైనా.. విమర్శలైనా.. మాటలతో కాదు ఆయన చేతలతో చూపించడం స్పెషలిటీ. తాజాగా ఏపీలో పెరిగిపోతున్న నిత్యవసర ధరలపై నిరసన ప్రదర్శన చేశారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. అందులో భాగంగా చేపట్టిన ప్రదర్శన.. ప్రత్యేకంగా ఆలోచింపజేసింది.

పప్పు ఉప్పుల నుంచి నూనెల వరకు.. కూరగాయల నుంచి గ్యాస్ సిలిండర్ వరకు.. కోడిగుడ్ల నుంచి చివరికి కోడి వరకు కూడా ఆయన అతని నిరసన ప్రదర్శనలు భాగం చేశారు. అన్ని రకాల పప్పు దినుసులు పేర్చారు. కూరగాయలను తోరణాలుగా అలంకరించారు. గ్యాస్ బండ, కోడిగుడ్లు పెట్టారు. అన్నిటికీ పెరిగిన రేట్లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అధిక ధరలు మోత అని ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరతో ఏపీ ధరలను పోల్చి జనాలపై పడుకున్న భారాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.

అహనా పెళ్ళంట కోడి సీన్ తో..

ఇక కోడిని వేలాడగట్టి.. అహనా పెళ్ళంట సీన్ గుర్తు చేశారు. ఈసారి లోబీ పాత్రలో కాదు.. కూటమి ప్రభుత్వ పాలనలో పెరిగిన ధరలతో కొనలేక.. చూస్తూ చికెన్ తినవలసిన దుస్థితి ఏర్పడిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కోడి, కూరగాయల సీన్ విశేషంగా ఆకట్టుకుంది. పక్క రాష్ట్రం తెలంగాణాతో పోల్చితే ఏపీలో నాలుగు రెట్లు అధిక ధరలు ఉన్నాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పప్పు, ఉప్పు, బియ్యం, నూనె, కాయగూరలు, ఆకు కూరలు, మాంసం ఇలా ప్రతీది కూడా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరలతో సామాన్యుడి పై మరింత ఆర్ధిక భారం పెరిగిందని చెప్పారు. పెరిగిన ధరలు కారణంగా ఒక కుటుంబానికి నెలకు సుమారు 12 వేలు అదనంగా ఖర్చు అవుతుందని తెలిపారు.నెలసరి సరుకులు కోసం అప్పులు చేయాలిసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us