Kesineni Nani: కేశినేని నాని అనూహ్య నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై.. కారణం ఏంటంటే..

|

Jun 10, 2024 | 9:12 PM

ఓటమి చెందిన నేతలకు విజయవాడ లోక్‌సభ సీటు కలిసి రాదనే రాజకీయ నానుడి మరోసారి రుజువైంది. 2014లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్రప్రసాద్‌, ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక 2019లో ఇదే సీటు నుంచి వైసీపీ కేండిడేట్‌గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పీవీపీ కనిపించడమే మానేశారు. రాజకీయాల్లో ఆయన పేరు కూడా వినిపించడం లేదు...

Kesineni Nani: కేశినేని నాని అనూహ్య నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై.. కారణం ఏంటంటే..
Kesineni Nani
Follow us on

ఓటమి చెందిన నేతలకు విజయవాడ లోక్‌సభ సీటు కలిసి రాదనే రాజకీయ నానుడి మరోసారి రుజువైంది. 2014లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్రప్రసాద్‌, ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక 2019లో ఇదే సీటు నుంచి వైసీపీ కేండిడేట్‌గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పీవీపీ కనిపించడమే మానేశారు. రాజకీయాల్లో ఆయన పేరు కూడా వినిపించడం లేదు. తాజాగా ఈ లిస్టులో కేశినేని నానీ కూడా చేరారు. ఈమధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కేశినేని కూడా రాజకీయాలకు దూరం అయ్యారు. విచిత్రం ఏటంటే మూడుసార్లు ఓడిపోయి పాలిటిక్స్‌కు బైబై చెప్పింది వైసీపీ అభ్యర్థులే కావడం విశేషం.

విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైసీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ఆయన X-లో ప్రకటించారు. తనకు రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విజయవాడ వాసులకు నాని కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా, విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని నాని తెలిపారు. విజయవాడ కోసం భవిష్యత్‌లో తాను ఎంత చెయ్యగలిగితే అంత చేస్తానన్నారు నాని.

కేశినేని నానీ వ్యవహార శైలి, మొదటి నుంచి వివాదాస్పదమే అంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. గతంలో కూడా ఆయనపై చాలా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. 2008లో వందలాది బస్సులతో ర్యాలీగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లిన కేశినేని, అప్పట్లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత కొద్ది నెలలకే చిరంజీవిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి పీఆర్పీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక 2019లో టీడీపీ తరఫున రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత, కేశినేని చాలా అహంకారపూరిత ధోరణితో వ్యవహరించారని, తనవల్లే విజయం సాధ్యమైనట్లు ఫీలయ్యేవారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. ఇలా ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఇమడలేని కేశినేని, వివాదాలకు కేంద్ర బిందువుగా మారారంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక 2017లో నాటి రవాణా శాఖ కమిషనర్‌తో కేశినేని నానీ గొడవ పడడం, అప్పట్లో పెను దుమారాన్ని సృష్టించింది. ఆ తర్వాత ఆయన దాదాపు 90 ఏళ్ల పాటు నడిచిన తమ కేశినేని ట్రావెల్స్‌ను కూడా అర్ధంతరంగా మూసేశారు. దానిపై కూడా చాలా ఆరోపణలు, విమర్శలు వచ్చాయి.

అసలు విజయవాడ ఎంపీ సీటు అంటేనే అదో హాటు సీటు. బెజవాడ అంటే ఏపీ రాజకీయాలకు అడ్డా. ఇక అలాంటి విజయవాడ ఎంపీ సీటులో గెలవడం అంటే మామూలు విషయం కాదు. కొమ్ములు తిరిగిన నేతలు కూడా విజయవాడ పాలిటిక్స్‌లో ఖంగు తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఏ నేత కూడా ఇక్కడినుంచి హ్యాట్రిక్‌ విక్టరీ కొట్టలేదు. రెండు సార్లు గెలిచిన తర్వాత వాళ్ల రాజకీయానికి ఫుల్‌స్టాప్ పడిపోవడం ఈమధ్య కాలంలో ఆనవాయితీగా మారింది. 2014, 2019లో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన కేశినేని నానీ, మూడోసారి ఓడిపోయి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. అంతకుముందు 2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్‌ ఎంపీగా విజయం సాధించారు. అయితే మూడోసారి ఆయన పోటీ కూడా చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. అయితే ఒకే ఒక్క నేత మాత్రం ఇక్కడి నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. 1962, 1967, 1971లో కానూరి లక్ష్మణరావు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు. అంతకుముందు, ఆ తర్వాత కూడా ఏ నాయకుడు ఈ రికార్డు సాధించలేకపోయారు. ఈ సీటులో డబుల్ విక్టరీ తర్వాత నేతలకు ట్రబుల్‌ తప్పడం లేదు. మూడోసారి విజయం సాధించడం అనే కల నెరవేరకపోగా, రాజకీయ సన్యాసం వైపు అడుగులు పడుతుండం మరో విశేషం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి