
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరదించింది. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని యథావిధిగా కొనసాగించేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, కొత్తగా ఎవరినీ పింఛన్ల లబ్ధిదారుల జాబితాలో చేర్చకూడదని స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటికే ఉన్న పింఛన్ల పంపిణీ విధానంలో ఎలాంటి మార్పులు చేయకూడదని తేల్చిచెప్పింది.
పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులను అధికారిక సిబ్బంది మాత్రమే విత్‌డ్రా చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వారి ద్వారానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగినా సహించేది లేదని హెచ్చరించింది.
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ముఖ్య కార్యనిర్వహణాధికారి సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు పంపిణీ కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.