YCP Supporter Sarpanch : అక్కడ గెలుపెరిది? ఆ కన్‌ఫ్యూజన్ ఏంటి? లెక్కల్లో గందరగోళం ఎందుకు? కడప జిల్లాలో ఆ పంచాయతీలో గంటకో ట్విస్ట్ బయటకొస్తుంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఐదుసార్లు లెక్కించారు. బద్వేల్ నియోజకవర్గం బి.కోడూరు మండలం తుమ్మలపల్లె పంచాయితీ ఓట్ల లెక్కింపులో గందరగోళం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 5 సార్లు ఓట్లు లెక్కించారు అధికారులు. పంచాయితీలో మొత్తం ఓట్లు 1070 మంది ఓటర్లు ఉండగా.. 920 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొదటిసారి లెక్కింపులో వైసిపి 3 ఓట్ల మెజారిటీ సాధించింది. గందరగోళం కారణంగా మరోసారి ఓట్లు లెక్కించారు. రెండోసారి లెక్కింపులోలోనూ వైసిపికి 2 ఓట్ల మెజారిటీ వచ్చాయి. మూడో సారి లెక్క తారుమారై లెక్కింపులో టిడిపికి 5 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక నాల్గోసారి లెక్కింపులో మాత్రం.. ఇద్దరికి సమాన ఓట్లు వచ్చాయి. ఐదో సారి ఓట్ల లెక్కింపులో వైసిపికి రెండు ఓట్ల మెజారిటీ రావడంతో అధికారులు.. అధికారికంగా ప్రకటించారు.
అధికారుల ప్రకటనపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మలపల్లె గ్రామపంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టిడిపి మద్దతుదారులు. ఓ దశలో డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు.