AP Panchayat Elections Phase 2 Results: ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,471 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 523 చోట్ల గెలుపొందారు. బీజేపీ, జనసేన మద్దతుదారులు 45.. ఇతరులు 90 చోట్ల గెలుపొందారు. రెండో విడతలో మొత్తంగా 3,328 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా..
ఇక.. పంచాయతీ పోరులో అసలు గెలుపెవరిది. ఓటమెవరిది. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలే అయినా.. తమదంటే తమదే విజయం అంటూ అధికార, విపక్ష పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. ఊరికి మొనగాళ్లం తామే అంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఒకరిని మించి ఒకరు సంబరాల్లో మునిగిపోతున్నారు. పల్లెపోరులో తమ జెండా ఎగిరిందంటే తమ జెండానే ఎగిరిందంటూ బాణాసంచాలను కాల్చుతున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. పోటాపోటీగా వైసీపీ, టీడీపీ నేతలు సంబరాల్లో పాల్గొంటూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.
పంచాయతీ ఫైట్‌లో తమ మద్దతుదారులే ప్రభంజనం సృష్టిస్తున్నారని అధికార వైసీపీ చెబుతోంది. మొదటి దశ కంటే రెండో దశలో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించామని తెలిపింది. రెండోదశలో 3328 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. తాము 2280 స్థానాలను కైవసం చేసుకున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
టీడీపీ కూడా తామేం తక్కువ కాదన్నట్టుగా మాట్లాడుతోంది. రెండో విడత ఎన్నికల్లో తమ మద్దతు దారులు 40 శాతం మంది గెలిచారని అంటోంది. 600కుపైగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామని ఇంకా తుదిఫలితాలను చూస్తే ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెబుతోంది. ఈ ఫలితాలు సర్కారుకు గుణపాఠమని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది.
మొదటిదశ తరహాలోనే రెండోదశలోనూ పల్లెజనం పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. తొలి విడతలో 81.41శాతం పోలింగ్ అవ్వగా.. రెండో విడతలో అది స్వల్పంగా పెరిగి 81.61 శాతంగా నమోదైంది. ఏకగ్రీవాలను చూసుకున్నా.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధులను చూసుకున్నా.. తమ వారే పై చేయిగా నిలిచారని వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ప్రకటించుకుంటున్నాయి.
ఎన్నికలంటే.. గెలుపోటములు కామన్. ఒకరు గెలిస్తే ఇంకొకరు ఓడిపోతారు. అయితే పోటీతత్వం అవసరమే అయినప్పటికీ.. అది మితిమీరనంత వరకు ఓకే. కానీ కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆధిపత్యానికి దారితీశాయి. గుంటూరు జిల్లా గొట్టిపాడులో వైసీపీ మద్దతుదారుడు ఒక్క ఓటు తేడాతో విజయంం సాధించడంపై టీడీపీ మద్దతుదారులు నిరసనకు దిగారు. రీ కౌంటింగ్ పెట్టాలని డిమాండ్ చేయడం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది.
పల్లె ప్రజలు ఇస్తున్న తీర్పును ఎవరికి వారు అనుకూలంగా మల్చుకునే యత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, పాలనపై సంతృప్తితో పల్లెజనం వైసీపీ అభిమానులకు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ అంటుండగా… సర్కార్ పాలనకు వ్యతిరేకంగా పంచాయతీ ఫలితాలు అద్దం పడుతున్నాయని టీడీపీ చెప్పేయత్నం చేస్తోంది.
Double Pregnancy Woman: సైన్స్‌కే సవాల్.. గర్భంతో ఉన్న మహిళ మూడు వారాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ!
Passenger Trains: రైల్వే ప్రయాణికులకు బిగ్ న్యూస్.. పూర్తిస్థాయిలో పట్టాలెక్కేది ఎప్పుడంటే..