AP New Districts Issue: ఏపీలో కొత్త జిల్లాలు ఫైనల్ అయ్యాయా? నూతన జిల్లాల ప్రతిపాదనలపై వచ్చిన అభ్యంతరాలేంటి? అధికారిక ప్రకటన ఎప్పుడు ఉండొచ్చనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. చెప్పినట్టుగానే జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు ఆదేశించారు సీఎం. ఇవాళ్టితో ఆ గడువు ముగియనుంది. అయితే, దీనిపై ఇప్పటివరకు కలెక్టర్లకు 7వేల 500 సలహాలు వచ్చినట్టు చెబుతున్నారు అధికారులు. ఎవరూ ఊహించనట్టు ఇప్పటివరకు విజయనగరం జిల్లా నుంచి ఎక్కువగా 4వేల 500 అభ్యంతరాలు, సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కృష్ణా జిల్లా నుంచి ఎక్కువగా సూచనలు వచ్చాయని అంటున్నారు అధికారులు. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తరువాత ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు కలెక్టర్లు. ఇంకేవైనా అంశాలుంటే అవన్నీ కూడా తుది నోటిఫికేషన్ ఇచ్చేలోగా తెలియజేయాలంటూ కోరారు సీఎస్. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు పై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా? సూచనలు ఇవ్వాలి అనుకున్నా మార్చి 3వ తేదీ వరకు సమయం ఇచ్చింది ప్రభుత్వం. ఆ గడువు ఇవాళ్టితో ముగియనుంది.
25 పార్లమెంట్ నియోజకవర్గాలను, జిల్లాలుగా ప్రకటించాలని ప్రభుత్వం ముందు నుంచే చెబుతూ వచ్చింది. అయితే అరుకు నియోజకవర్గం పెద్దది కావడంతో, దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ఏపీలో 26 జిల్లాలు కానున్నాయి. అయితే, వీటిపై పెద్దగా అభ్యంతరాలు ఉండవని భావించింది ప్రభుత్వం. కానీ ఊహించని విధంగా కొన్నిచోట్ల అభ్యంతరాలు వచ్చాయి. అయితే గడువు ముగుస్తున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది.
Also Read: