
సాధారణంగా అత్తా కోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు ఉంటాయని చెబుతుంటారు. టీవీ సీరియళ్లలోనూ ఇలాంటి సన్నివేశాలు తరచూ కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ అత్తా కోడళ్ల పోరు రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. కర్నూలు నగర మేయర్ పదవి కోసం అత్త, కోడలు వేర్వేరు పార్టీల తరఫున పోటీకి సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. ఒకరు తెలుగుదేశం పార్టీ నుంచి, మరొకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ నుంచి ప్రత్యూష.. వైసీపీ నుంచి సుశీల
కర్నూలు మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ తరఫున బొల్లెద్దుల ప్రత్యూష, వైసీపీ తరఫున ఉతకల్ల సుశీల పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ ప్రత్యర్థిత్వం ఉన్నప్పటికీ, కుటుంబపరంగా దగ్గరి సంబంధం ఉంది. ప్రత్యూష సోదరి ప్రియాంకను సుశీల కుమారుడు భార్గవ్ వివాహం చేసుకున్నారు. ఈ బంధం కారణంగా సుశీల, ప్రత్యూషకు అత్త అవుతారు. ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు మేయర్ పీఠం కోసం పోటీ పడుతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు
ఉతకల్ల సుశీల కుటుంబానికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె భర్త మణి గాంధీ గతంలో కోడుమూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. సుశీల మామ శిఖామణి కూడా కోడుమూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో సుశీలకు రాజకీయ కుటుంబ నేపథ్యం బలంగా ఉంది.
మరోవైపు, బొల్లెద్దుల ప్రత్యూష కూడా రాజకీయాల్లో అనుభవం ఉన్న నాయకురాలే. కర్నూలు 51వ డివిజన్ నుంచి గత ఐదేళ్లపాటు కార్పొరేటర్గా పనిచేశారు. ఆమె తండ్రి రామకృష్ణ మంత్రి టీజీ భరత్కు అనుచరుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మద్దతుతో ప్రత్యూషకు మేయర్ అభ్యర్థిగా అవకాశం లభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అత్త గెలుస్తుందా? కోడలు విజయం సాధిస్తుందా?
ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ.. రెండు పార్టీల మధ్య పోటీకి కుటుంబ బంధం మరింత ఆసక్తిని జోడిస్తోంది. రాజకీయ అనుభవం, పార్టీ బలం, కార్పొరేటర్ల మద్దతు వంటి అంశాలు ఫలితాన్ని ప్రభావితం చేయనున్నాయి. చివరకు అత్త సుశీల విజయం సాధిస్తారా? లేక కోడలు ప్రత్యూష మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. కర్నూలు మేయర్ ఎన్నికల ఫలితం కోసం రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..