AP Municipal Elections 2021 : అవాంతరాలు దాటుకుంటూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పోలింగ్‌కు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో మున్సిపోల్స్ రాజకీయం వేడెక్కుతోంది. ఒకవైపు ఏకగ్రీవాలు.. మరోవైపు, అభ్యర్థుల జంపింగ్‌లతో నగరపాలికల్లో పాలిట్రిక్స్ నడుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ లోపే ఇంకెతమంది జంప్ అవుతారో..!
మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండేది ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ఎన్ని ఏకగ్రీవాలో… ఎక్కడ ఎన్నికలు ఉంటాయో అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే… చివరి నిమిషంలో టీడీపీని వదిలి వైసీపీలోకి జంప్ చేస్తున్నారు కొందరు అభ్యర్థులు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాల్టీలో 24 వార్డులు ఉంటే… రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయలేదు. మిగిలిన 22 మంది అభ్యర్థుల్లో 18 మంది వైసీపీ కండువా కప్పుకున్నారు. అంటే మొత్తం 24లో 20 సీట్లలో టీడీపీ అభ్యర్థులే లేరు.
ఇక, మిగిలిన మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ ప్రభావం ఎంత వరకు ఉంటుందనేది నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిస్తే కానీ తెలియదు. మరోవైపు రెండు జిల్లాల్లోని నాలుగు మున్సిపాల్టీల్లో 14 చోట్ల నామినేషన్లు వేసేందుకు మళ్లీ అవకాశం ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అక్కడ ఏడు వార్డుల్లో మాత్రమే అభ్యర్థులు తిరిగి నామినేషన్ వేశారు.
అటు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాల్టీలో అవకాశం ఇచ్చిన మూడు వార్డులకు కొత్తగా ఎవరూ నామినేషన్ వేయడానికి రాలేదు. తిరుపతి కార్పొరేషన్ ఆరు వార్డుల్లో మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు మళ్లీ నామినేషన్ వేశారు. 2, 21, 45 డివిజన్లలో నామినేషన్లు వస్తే… 8, 10, 41 వార్డులకు కొత్తగా నామినేషన్లు రాలేదు.
కడప జిల్లాలో రెండు మున్సిపాల్టీల్లోని 5 వార్డుల్లో మళ్లీ నామినేషన్‌కు అవకాశం ఇచ్చారు. రాయచోటిలో 20 వార్డులో టీడీపీ అభ్యర్థి మళ్లీ నామినేషన్ వేశారు. 31వ వార్డులో మాత్రం ఎవరూ వేయలేదు. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో మూడు వార్డులకు పాత నామినేషన్లను పునరుద్దరించినట్లు ప్రకటించారు కమిషనర్ రంగస్వామి. దీంతో 6వ వార్డులో వైసీపీ రెబల్, 11వ వార్డులో టీడీపీ, 15వ వార్డులో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నట్లయింది.
ఇదిలావుంటే, రాష్ట్రంలో మొత్తం 75 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎన్ని ఏకగ్రీవాలో బుధవారం మధ్యాహ్నం నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత తేలుతుంది.
ఇదీచదవండిః బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం.. ముందే తెలిసి ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నారుః బీజేపీ ప్రతినిధి సంబిత్ పత్రా