AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Polls 2026: స్థానిక ఎన్నికల్లో తేలిన గెలుపు గుర్రాలు.. మరి గ్రామాలకు ఒరిగేదెంత?

AP Local Polls 2026: ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి ఆధిక్యం సాధించి విజయోత్సాహంలో మునిగిపోయింది. అయితే ఎన్నికల ఫలితాల సంబరాల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థుల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న.

AP Local Polls 2026: స్థానిక ఎన్నికల్లో తేలిన గెలుపు గుర్రాలు.. మరి గ్రామాలకు ఒరిగేదెంత?
AP Local Body Elections 2026
Siva Nagaraju
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 7:03 PM

Share

ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి జోరు చూపించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఆధిక్యం సాధించింది. నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కార్యకర్తలు జెండాలు పట్టుకుని ఊరేగుతున్నారు. కానీ గ్రామాల్లో మాత్రం సమస్యలు అలాగే ఉన్నాయి. రోడ్లు గుంతలమయం. డ్రైనేజీలు పొంగుతున్నాయి. తాగునీటి కోసం జనం ట్యాంకర్ల వెంట తిరుగుతున్నారు. గెలుపు సంబరాలు సరే.. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయన్నదే ప్రజల మాట.

గెలుపు లెక్కలు వేరు..గ్రామాల లెక్కలు వేరు..

జెడ్పీటీసీ ఎన్నికల్లో 582 స్థానాలకు గాను కూటమి 499 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 406, జనసేన 73, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించాయి. వైసీపీ 76 స్థానాలు దక్కించుకుంది. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి ఆధిక్యం చూపించింది. టీడీపీ 4,806, జనసేన 938, బీజేపీ 117 స్థానాలు గెలుచుకున్నాయి. వైసీపీ 1,711 స్థానాల్లో విజయం సాధించింది. ఈ లెక్కలు పార్టీల బలాన్ని చూపిస్తున్నాయి. కానీ గ్రామాల తలరాత మారిందా లేదా అన్నది మాత్రం పాలకుల పనితీరే తేల్చాలి.

గెలిచినోళ్లకు ఇప్పుడే అసలు పరీక్ష

ఎన్నికల ముందు నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారు. రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు కడతామని, తాగునీటి సమస్య తీరుస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలను చేతల్లో చూపించాలి. గెలిచిన తర్వాత మొదటి వంద రోజుల్లో ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలి. ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాటలతో మేడలు కట్టలేరు. చేతల్లో చూపితేనే నమ్మకం పెరుగుతుంది.

నిధులుంటేనే అభివృద్ధి.

స్థానిక సంస్థలకు నిధుల కొరత పెద్ద సమస్యగా ఉంది. కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే నిధులపైనే చాలా పనులు ఆధారపడి ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం కింద 2025–26లో ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రెండు విడతల్లో కలిపి రూ.821.52 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇక 16వ ఆర్థిక సంఘం కాలానికి 2026–31 మధ్య రాష్ట్రానికి సుమారు రూ.16,627 కోట్ల కేటాయింపుల సిఫార్సు ఉంది. అయితే ఈ నిధులు విడతల వారీగా, నిబంధనల ప్రకారం అందుతాయి. కేటాయింపులు వచ్చాయని సరిపోదు. అవి గ్రామాలకు చేరి పనుల రూపంలో కనిపించాలి.

ఒకే కూటమి పాలనతో పనులు వేగంగా జరుగుతాయా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. స్థానిక ఎన్నికల్లోనూ కూటమి ఆధిక్యం సాధించింది. దీంతో గ్రామాల అభివృద్ధికి నిధులు, అనుమతులు త్వరగా వస్తాయన్న ఆశ ప్రజల్లో ఉంది. కానీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైతే పనులు ఆగిపోతాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. పంట పండాలంటే విత్తనం ఒక్కటే చాలదు. నీళ్లు కూడా కావాలి అన్న తీరులో నిధులతో పాటు సమన్వయం కూడా అవసరం.

మహిళలకు పదవి..నిర్ణయాల్లోనూ భాగముందా?

రిజర్వేషన్లతో చాలాచోట్ల మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గ్రామ సమస్యలపై వారు స్వయంగా మాట్లాడుతున్నారా? నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేక వారి పేరుతో కుటుంబ సభ్యులే పెత్తనం చేస్తున్నారా అన్నది కూడా చూడాలి. మహిళా ప్రతినిధులకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలి. అప్పుడే వారి ఎన్నికకు నిజమైన అర్థం ఉంటుంది.

యువతకు ఉపాధి

పల్లెల్లో యువతకు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో చిన్న పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం కృషి చేయాలి. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలి. యువత ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి తగ్గితేనే గ్రామాలు బలపడతాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారన్నది అభివృద్ధికి అడ్డుకాకూడదు. తమకు ఓట్లు వేయలేదని కొన్ని గ్రామాలను పక్కన పెట్టడం సరికాదు. ప్రతి గ్రామానికి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సదుపాయాలు అందాలి. గెలిచినోళ్లకు ఓట్లు వేసినవాళ్లే కాదు. ఓడిపోయినోళ్లకు ఓట్లు వేసినవాళ్లూ ప్రజలే.

అధికారుల సహకారం

ప్రజాప్రతినిధులు సమస్యలను గుర్తించినా పనులు జరగాలంటే అధికారుల సహకారం అవసరం. ప్రతిపాదనలు పంపినా ఫైళ్లు కదలకపోతే అభివృద్ధి ముందుకు సాగదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉన్న అధికారాలు, పరిమితులు కూడా ప్రజలకు తెలియాలి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ మధ్య సమన్వయం ఉండాలి. గ్రామసభల్లో ప్రజల సమస్యలు చర్చకు రావాలి. పనుల ఖర్చు, వచ్చిన నిధుల వివరాలు అందరికీ తెలిసేలా ఉండాలి.

ప్రజల నిఘా ఉంటేనే ..

ఎన్నికల సమయంలో ఓటు వేసి ఇంటికి వెళ్లిపోతే సరిపోదు. గెలిచిన ప్రతినిధులు ఏం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా అని ప్రజలు గమనించాలి. గ్రామసభలకు వెళ్లాలి. పనుల్లో నాణ్యత లేకపోతే ప్రశ్నించాలి. నిధులు ఎక్కడ ఖర్చయ్యాయో అడగాలి. ఊరు బాగుంటేనే పేరు నిలుస్తుంది అన్నట్టుగా గ్రామ అభివృద్ధి అందరి బాధ్యత.

స్థానిక ఎన్నికల్లో గెలుపు పార్టీలకు రాజకీయ బలాన్ని ఇచ్చింది. కానీ ఆ బలం గ్రామాల సమస్యలు తీర్చడానికి ఉపయోగపడాలి. పదవులు వచ్చాయని సంబరాలు చేసుకోవడం కాదు. ప్రజల కష్టాలు తగ్గించడమే అసలైన పని. ఎన్నికల్లో గెలిచినవాళ్లకు ఇప్పుడు చేతల్లో చూపించే సమయం వచ్చింది. రోడ్లు బాగుపడితే, నీళ్లు వస్తే, డ్రైనేజీలు సరిగా ఉంటేనే ప్రజలు నిజమైన గెలుపుగా భావిస్తారని గుర్తుంచుకోవాలి.

-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్ ఫుట్ ఎడిటర్, టీవీ9

Follow Us