
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన ఐదు పిటిషన్లపై కోర్టు గురువారం (అక్టోబర్ 01) తీర్పు ఇవ్వనుంది. మరి హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది…? తీర్పు తర్వాతైనా ఎన్నికల నోటిఫికేషన్‌పై స్పష్టత వస్తుందా..? అసలు ఐదు పిటిషన్లలో ఉన్న అంశాలేంటి…? అటు పొలిటికల్ పార్టీల వెర్షన్ ఎలా ఉండబోతుందన్నదీ ఆసక్తికరంగా మారింది.
స్థానిక సమరం… కోర్టు తీర్పుతో ముడిపడింది… యస్…ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఐదు పిటిషన్లపై విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇప్పుడు తీర్పు ఎలా ఉండబోతోందన్న దానిపైనే రాజకీయ పార్టీల్లోనే కాదు.. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రధాన పిటిషన్. అలాగే… ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో నిర్ణీత గడువులోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో పిటిషన్ కోర్టు ముందుకొచ్చింది. పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కూడా పిటిషన్ దాఖలైంది. వీటితో పాటు ఎన్నికల ప్రక్రియ, రిజర్వేషన్లకు సంబంధించిన మరో అంశంపైనా పిటిషన్ దాఖలైంది. ఈ ఐదు పిటిషన్లపై కోర్టు తీర్పు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇటు రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు.. స్థానిక ఎన్నికల కోసం అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు. కూటమిలో సర్దుబాట్లపై జిల్లాల వారీగా ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేశారు. మూడు పార్టీల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికల నిర్వహణ, సమన్వయం, పర్యవేక్షణ కోసం గతంలో ఏర్పాటు చేసిన కమిటీలను రద్దు చేసి… పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాలు, స్థానిక నాయకుల మధ్య సమన్వయంపై ఈ కమిటీలు దృష్టి పెట్టనున్నాయి. ఇటు బీజేపీ కూడా జోరు చూపిస్తోంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో భేటీ అయ్యారు. ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించారు.
మొత్తంగా… ఐదు పిటిషన్లు.. ఐదు కీలక అంశాలు.. వీటిపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అవుతుందా..? రిజర్వేషన్లపై ఎలాంటి స్పష్టత వస్తుంది..? అన్నది తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..