Municipal elections : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి మరోసారి షాక్ తగిలినట్లయింది. మొన్న నాలుగు మున్సిపాల్టీల్లోని 14 వార్డుల్లో మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్. అందులో ఏడు చోట్ల అభ్యర్థులు మళ్లీ నామినేషన్ వేశారు. ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాలతో ఆ ఏడుగురి నామినేషన్లు చెల్లనట్లే అయింది.
ఇదొక్కటే కాదు… వాలంటీర్ల అంశంలోనూ SECకి షాక్ ఇచ్చింది హైకోర్టు. మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లను దూరం పెట్టాలని, వారి నుంచి ఫోన్లను, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ. దానిపై హైకోర్టుకు వెళ్లింది ప్రభుత్వం. విచారణ అనంతరం SEC ఆదేశాలను నిలుపుదల చేసింది. వాలంటీర్ల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకోవద్దని ఆదేశించింది. కాగా, నిన్న కూడా హైకోర్టులో ఎన్నికల సంఘానికి రేషన్ సరుకుల పంపిణీ వాహనాలకు సంబంధించి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.