Andhra News: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. కంటి సమస్యల గుర్తించేందుకు సరికొత్త ఏఐ టెక్నాలజీ!

ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదరిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. మదుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు సరికొత్త AI ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతుంది. కంటి వైద్యుల కొరత ఉన్న ప్రాంతాల్లో రోగులను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ఇది చాలా బాగా ఉపయోగపనుంది.

Andhra News: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. కంటి సమస్యల గుర్తించేందుకు సరికొత్త ఏఐ టెక్నాలజీ!
Andhra Pradesh To Deploy Ai For Early Eye Disease Detection

Edited By:

Updated on: Jun 10, 2026 | 7:06 PM

వైద్య సేవల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మదుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతోంది. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటి వైద్యుల కొరత ఉన్న ప్రాంతాల్లోనూ రోగులను ముందుగానే గుర్తించి చికిత్సకు పంపించే అవకాశం ఈ వ్యవస్థ ద్వారా లభించనుంది.

ఇమేజ్ చూస్తే చాలు.. సమస్యను గుర్తించే ఏఐ

ప్రస్తుతం రెటినోపతి నిర్ధారణ కోసం ఫండస్ కెమెరాలతో తీసిన చిత్రాలను కంటి వైద్య నిపుణులు పరిశీలించి చికిత్స నిర్ణయిస్తున్నారు. అయితే ఏఐ అందుబాటులోకి రావడంతో ఫండస్ కెమెరాతో తీసిన ఇమేజ్‌ను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, రెటినోపతి ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని క్షణాల్లో విశ్లేషించి నివేదిక ఇస్తుంది. వైద్యుడు లేకున్నా ప్రాథమిక స్థాయిలో సమస్యను గుర్తించి రోగిని అప్రమత్తం చేసే అవకాశం కలుగుతుంది. దీంతో చికిత్స ఆలస్యం కావడం, సమస్య ముదరడం వంటి పరిస్థితులను గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

మదుమేహ రోగుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు

మదుమేహంతో బాధపడుతున్న వారిలో ఎక్కువ శాతం మంది రెటినోపతి సమస్యలకు గురవుతున్నారు. కంటి చూపు మందగించడం, నరాలు దెబ్బతినడం, రెటీనా పొర విడిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది రోగులు సమస్య ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తుండటంతో శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి నెలకు వచ్చే మదుమేహ రోగుల్లో 15 నుంచి 20 శాతం మంది వరకు రెటినోపతి లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు స్క్రీనింగ్ వ్యవస్థ అవసరం మరింత పెరిగింది.

ఎయిమ్స్ అనుభవంతో రాష్ట్రంలో ప్రయోగం

కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎయిమ్స్, ఎయిమ్స్-రిషికేశ్ సంస్థల సహకారంతో వాద్వాని సంస్థ రూపొందించిన ‘మధునేత్ర’ ఏఐ సొల్యూషన్ ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తోంది. దాదాపు 13 వేల మంది రెటినోపతి రోగుల వివరాలతో ఈ ఏఐ వ్యవస్థకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలోని 45 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ సేవలు వినియోగంలో ఉన్నాయి. అదే నమూనాను రాష్ట్రంలో అమలు చేస్తూ గుంటూరు, కర్నూలు, విశాఖలో మూడు నెలల పాటు పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు.

9 వేల మంది రోగులపై అధ్యయనం..

రాష్ట్రవ్యాప్త విస్తరణ పైలట్ ప్రాజెక్టులో భాగంగా మూడు ఆసుపత్రుల్లో కలిపి సుమారు 9 వేల మంది మదుమేహ రోగులకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ ఇచ్చే నివేదికలను కంటి వైద్య నిపుణులు పరిశీలించి వాటి ఖచ్చితత్వాన్ని అంచనా వేయనున్నారు. ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించే అవకాశాలు ఉన్నాయి. సాంకేతికతను వైద్య సేవలకు అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us