
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా చేరవేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అర్హత ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను అధికారికంగా ఎంప్యానెల్ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్ పాలసీ’కి ఆమోదం తెలిపింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉన్న క్రియేటర్లు ఈ విధానం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కనీసం 10 వేల మంది ఫాలోవర్లు లేదా సబ్‌స్క్రైబర్లు ఉన్నవారిని పరిశీలించి.. వారి కంటెంట్ నాణ్యత, విశ్వసనీయత, రీచ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయనున్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్లను వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారు అత్యున్నత కేటగిరీలో ఉంటారు. 50 వేల నుంచి 99,999 మంది, 25 వేల నుంచి 49,999 మంది, 10 వేల నుంచి 24,999 మంది ఫాలోవర్లు ఉన్నవారికి వరుసగా తదుపరి కేటగిరీలు ఉంటాయి.
| A | 1,00,000 పైగా | రూ.15,000 |
| B | 50,000–99,999 | రూ.7,500 |
| C | 25,000–49,999 | రూ.5,000 |
| D | 10,000–24,999 | రూ.2,500 |
అయితే కేవలం ఫాలోవర్ల సంఖ్య ఆధారంగానే ఎంపిక ఉండదు. విశ్వసనీయత, కంటెంట్ నాణ్యత, ప్రజల్లో ప్రభావం వంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు.
అర్హులైన ఇన్‌ఫ్లుయెన్సర్లను స్క్రూటినీ కమిటీ పరిశీలించి ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి డిజిటల్, ఫిజికల్ ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. తొలుత ఏడాది పాటు ఎంప్యానెల్‌మెంట్ ఉంటుంది. పనితీరును పరిశీలించిన తర్వాత మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం అందించే గ్రాఫిక్స్, ఆడియో-విజువల్ కంటెంట్‌ను ప్రచారం చేయడంతో పాటు.. ఇన్‌ఫ్లుయెన్సర్లు సొంతంగా రూపొందించే కంటెంట్‌కు కూడా ప్రత్యేకంగా పారితోషికం చెల్లించే విధానం ఉంది. సొంతంగా రూపొందించే ఆడియో-విజువల్ కంటెంట్‌కు కేటగిరీని బట్టి రూ.15 వేల వరకు చెల్లించే నిబంధనలు ఉన్నాయి.
ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్, దరఖాస్తులు, ఇతర ప్రక్రియల కోసం ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అర్హత ఉన్న క్రియేటర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.