AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిలో అద్భుత నిర్మాణాలు.. ఐకానిక్‌ టవర్ల వెనుక ఇంజినీరింగ్‌ అద్భుతాలు

అమరావతిలో అద్భుత నిర్మాణాలు.. ఐకానిక్‌ టవర్ల వెనుక ఇంజినీరింగ్‌ అద్భుతాలు

Phani CH
|

Updated on: Sep 29, 2026 | 9:27 PM

Share

అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్‌ టవర్లు ప్రత్యేక ఇంజినీరింగ్‌తో రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో అంతస్తు 50 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పుతో ఉన్నా మధ్యలో సాధారణ కాలమ్స్‌ ఉండవు. డయాగ్రిడ్‌ విధానంలో బయటివైపు ఏటవాలుగా అమర్చిన ఉక్కు స్తంభాలు త్రిభుజాలుగా కలుస్తాయి. మధ్యలోని కోర్‌వాల్‌తో కలిసి భవన భారాన్ని మోయడంతో విశాలమైన కార్యాలయ స్థలాన్ని అందించేలా డిజైన్‌ చేస్తున్నారు. ఐదు టవర్లతో పాటు తొమ్మిది అమినిటీస్‌ బ్లాక్స్‌ కూడా ఈ సముదాయంలో భాగం కానున్నాయి.

అమరావతిలో ఒక అద్భుతం రూపుదిద్దుకుంటోంది. 50 మీటర్ల పొడవు.. 50 మీటర్ల వెడల్పు.. మధ్యలో ఒక్క స్తంభం కూడా ఉండదు. అయినా దాని మీద అంతస్తుల మీద అంతస్తులు లేస్తాయి. బయట కనిపించే డైమండ్‌ ఆకారపు ఉక్కు స్తంభాలే ఆ భారీ భవనాన్ని మోస్తాయి. ఇవి పూర్తయితే కేవలం ప్రభుత్వ కార్యాలయాలుగా మాత్రమే కాదు.. అమరావతి నగర ముఖచిత్రమే మారనుంది. మరి ఈ భారీ భవనాలను మధ్యలో సాధారణ స్తంభాలు లేకుండా ఎలా నిలబెడతారు? తుపాన్లు, భూకంపాల ధాటిని తట్టుకునే బలం ఎక్కడి నుంచి వస్తుంది?.. అమరావతి ఐకానిక్‌ టవర్ల వెనుక ఉన్న ఇంజినీరింగ్‌ ఏంటి?.. అమరావతి రూపురేఖలే మార్చే ఆకాశహర్మ్యాలు అమరావతి ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలో కనిపించే ఈస్పెషల్ స్ట్రక్చర్ వెనుకున్న సాంకేతిక పేరు డయాగ్రిడ్. సాధారణంగా భారీ భవనమంటే అంతస్తుల నిండా కాలమ్స్‌.. వాటిని కలుపుతూ బీమ్స్‌ ఉంటాయి. కానీ అమరావతిలో నిర్మిస్తున్న ఈ టవర్లలో ఆలెక్కలేం ఉండవు. భవనం మధ్యలో వెన్నెముకలా నిలిచే భారీ కోర్‌వాల్‌ ఉంటుంది. బయటివైపు ఉక్కు స్తంభాలను ఏటవాలుగా అమర్చి త్రిభుజాలుగా కలుపుతారు. అవే ఒకదానితో ఒకటి పెనవేసుకుంటూ బయట నుంచి చూస్తే భారీ డైమండ్ల వరుసలా కనిపిస్తాయి. భవనంపై పడే భారాన్ని కోర్‌వాల్‌తో కలిసి ఈ ఉక్కు డయాగ్రిడ్‌ తనపైకి తీసుకుంటుంది. తుపానుల సమయంలో వీచే బలమైన గాలులు.. భూకంపాల సమయంలో వచ్చే కదలికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో డయాగ్రిడ్‌ విధానంతో ఆకాశహర్మ్యాల నిర్మాణం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఐకానిక్‌ టవర్‌లోని ఒక్కో అంతస్తు 50 మీటర్ల పొడవు.. 50 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ ఆ విశాలమైన ప్రదేశంలో మధ్య మధ్యలో అడ్డొచ్చే సాధారణ కాలమ్స్‌ కనిపించవు. లిఫ్టులు.. మెట్లు.. మరుగుదొడ్లు.. పాంట్రీలు.. అగ్నిమాపక వ్యవస్థలు.. భవనం నడవడానికి అవసరమైన ప్రధాన సదుపాయాలన్నింటినీ మధ్యలోని కోర్‌వాల్‌ పరిధిలోనే సర్దేస్తారు. సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీ టవర్లలో ఈ కోర్‌వాల్‌ విస్తీర్ణం 26 బై 23 మీటర్లు. దీంతో కోర్‌ బయట మిగిలే విశాలమైన ప్రదేశాన్ని అవసరానికి తగ్గట్లు కార్యాలయాలుగా మార్చుకోవచ్చు. విభాగాల అవసరాలు మారితే గదుల అమరికనూ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఐదు టవర్లు మాత్రమే కాదు.. వాటి చుట్టూ మరో తొమ్మిది అమినిటీస్‌ బ్లాక్స్‌ కూడా ఉంటాయి. అంటే మొత్తం 14 భవనాలతో ఒక పరిపాలనా సముదాయం రూపుదిద్దుకోనుంది. ప్రభుత్వ పనికోసం వచ్చిన ప్రతి అవసరానికీ మరో భవనం వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేకుండా సదుపాయాలను ఒకేచోట ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్లు స్వీకరించే హాల్‌ నుంచి సమావేశ మందిరాల వరకు.. ఉద్యోగ సంఘాల హాళ్ల నుంచి బ్యాంకులు, పోస్టాఫీస్‌ వరకు.. లైబ్రరీ నుంచి శిశు సంరక్షణ కేంద్రాల వరకు ఇందులోనే ఏర్పాటు చేయనున్నారు. కామన్‌ స్టోరేజ్‌, డేటా సెంటర్లకూ ప్రత్యేక స్థలం ఉంటుంది. ఉద్యోగుల కోసం జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వంటి సదుపాయాలు.. భవనాలపై టెర్రస్‌ గార్డెన్లు కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఈ టవర్ల పరిమాణం చూస్తే ఐదు టవర్లకే సుమారు లక్ష టన్నుల స్ట్రక్చరల్‌ స్టీల్‌ అవసరం. డయాగ్రిడ్‌లో అమర్చే ఒక్కో భారీ ఉక్కు స్తంభం 15 నుంచి 16 టన్నుల బరువు ఉంటుంది. వాటిని ఒకదానితో మరొకటి బిగించే జంక్షన్‌ బాక్సులు మరింత భారీగా ఉంటాయి. ఒక్కోటి 20 టన్నుల నుంచి 32 టన్నుల వరకు బరువు ఉంటుంది. ఐదు టవర్ల నిర్మాణంలో సుమారు లక్షా 60 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వినియోగించనున్నారు. ఇక బయట నుంచి ఈ భవనాలకు ప్రత్యేక రూపాన్ని ఇచ్చే గాజు పలకలకే దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. భవనం ఎంత భారీగా ఉంటుందో.. దాని పార్కింగ్‌ కూడా అదే స్థాయిలో ఉండనుంది. రెండు భారీ పోడియంలలో ఒకేసారి నాలుగు వేల కార్లను నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి లేకుండా పార్కింగ్‌ను ప్రధాన భవన నిర్మాణంలోనే భాగం చేశారు. పైకి ఐదు ఐకానిక్‌ టవర్లు.. వాటి పక్కనే తొమ్మిది అమినిటీస్‌ బ్లాక్స్‌.. కింద వేల కార్లకు పార్కింగ్‌. మధ్యలో పరిపాలనకు అవసరమైన సదుపాయాలన్నీ ఒకేచోట ఉండనున్నాయి. ప్రస్తుతం ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు పూర్తయితే.. అమరావతి పరిపాలనా నగరంలో ఈ ఐదు ఆకాశహర్మ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chedi Gang: హైదరాబాద్‌పై మళ్లీ చెడ్డీ గ్యాంగ్ పంజా

దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏఐకి కూడా నొప్పా..! నొప్పి భరించలేక యూజర్లపై ఏఐ దాడి.. అధ్యయనంలో సంచలన విషయాలు!

హెయిర్‌కట్ తర్వాత ఆ మసాజ్ చేయిస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం!

Follow Us