దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన వేళ బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మళ్లీ మారుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా దంచికొట్టిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని తరుణంలో, బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మళ్లీ మారాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఊపందుకోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్ష సూచనతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మన్యం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వానలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర , రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 10.80 అడుగులకు చేరింది. దిగువ ప్రాంతాలకు మరియు సముద్రంలోకి గోదావరి వరద నీటి విడుదల కొనసాగుతోంది. బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉంచిన అధికారులు, ప్రస్తుతం 8,31,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం స్థిరంగా ఉండటంతో అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజ్ గేట్లన్నింటినీ పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం నది నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గడంతో, వచ్చిన నీటిని వచ్చినట్లే వివిధ ప్రధాన కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌కు 12,411 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. బ్యారేజ్ నీటిమట్టం 12 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో ఎంతైతే వస్తోందో అదే స్థాయిలో 12,411 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న సాగునీటి కాలువలకు మళ్లిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో లంక గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. గురజాపులంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లంకాఫ్ ఠాణేలంక, కూనాలంక గ్రామాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండటంతో, ఉదయాన్నే దట్టమైన పొగమంచు అలముకుంటోంది. పాడేరులో ప్రస్తుతం 18 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అందమైన వాతావరణం, మంచు కురుస్తున్న దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాడేరుతో పాటు సమీపంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాక గణనీయంగా పెరిగింది. ఉదయాన్నే మంచు తెరల నడుమ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. విశాఖపట్నంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కాసేపటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, మర్రిపాలెం, పెందుర్తి తదితర ప్రాంతాల్లో ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన వాన పడింది. కాసేపటికే వర్షం తీవ్రత పెరగడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బలమైన ఈదురుగాలుల కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ నెమ్మదించి నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. తుఫాను కారణంగా గత నాలుగైదు రోజులుగా జోరున వర్షాలు కురిసిన శ్రీకాకుళం జిల్లాలో ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో, ఈ వాతావరణ మార్పుతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. ఎండలు పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. పగటి పూట పది దాటితే బయటికి రాలేకపోతున్నామని, తీవ్రమైన ఉక్కపోతతో సతమతమవుతున్నట్లు శ్రీకాకుళం వాసులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధ వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పాటు భీకర ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల దగ్గర నిలబడవద్దని సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వానలు దంచికొట్టే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. భారీ వర్షాల హెచ్చరికలరీత్యా ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నదిలో నీటిమట్టం మరింత పడిపోయి ప్రస్తుతం 34 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహానికి అనుగుణంగా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 5,68,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వరద ఉధృతి తగ్గడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో మొరాదాబాద్ ప్రాంతంలో పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. వరదల తీవ్రతకు వందల ఎకరాల్లో పంట నేలమట్టమైంది. ముఖ్యంగా చెరకు, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల మధ్యలో భారీగా వరద నీరు నిలచిపోవడంతో పంట రంగుమారి పూర్తిగా పాడైపోయింది. పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే సమయంలో పంట నష్టపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదనతో వేడుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏఐకి కూడా నొప్పా..! నొప్పి భరించలేక యూజర్లపై ఏఐ దాడి.. అధ్యయనంలో సంచలన విషయాలు!
హెయిర్‌కట్ తర్వాత ఆ మసాజ్ చేయిస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం!
ఏఐకి కూడా నొప్పా..! నొప్పి భరించలేక యూజర్లపై ఏఐ దాడి
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!

