AP News: ఏపీలో భూకబ్జాలపై బుల్డోజర్‌..! ప్రతీ జిల్లాపైనా ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం

ఏపీలో ప్రతి జిల్లాలోనూ భూకబ్జాలు జరిగాయనేది కూటమి ప్రభుత్వం ఆరోపణ. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో భూదందాలు భారీగా జరిగాయని అనుమానిస్తోంది. అందుకే, ఒక్కో కబ్జాను బయటకు తీసి, దాని వెనక ఉన్నదెవరో బయటపెట్టాలనుకుంటోంది.

AP News: ఏపీలో భూకబ్జాలపై బుల్డోజర్‌..! ప్రతీ జిల్లాపైనా ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం
Andhra Government

Updated on: Aug 18, 2024 | 8:00 AM

ఏపీలో ప్రతి జిల్లాలోనూ భూకబ్జాలు జరిగాయనేది కూటమి ప్రభుత్వం ఆరోపణ. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో భూదందాలు భారీగా జరిగాయని అనుమానిస్తోంది. అందుకే, ఒక్కో కబ్జాను బయటకు తీసి, దాని వెనక ఉన్నదెవరో బయటపెట్టాలనుకుంటోంది. గత ఐదేళ్లలో జరిగిన భూ లావాదేవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన.. సిసోడియా విశాఖలో కబ్జాలపై ఆరా తీస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో భూకబ్జాల అంతుతేల్చబోతోంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యగా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో భారీగా భూములు దోచేశారనే ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటి సంగతి తేల్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేరుగా రంగంలోకి దిగారు. విశాఖలోని దస్పల్లా భూములు, హయగ్రీవ ల్యాండ్స్‌ను స్వయంగా పరిశీలించారు. ఎర్రమట్టి దిబ్బల ఆక్రమణల నేపథ్యంలో అక్కడికి కూడా వెళ్లారు. శారదా పీఠానికి కేటాయించిన భూముల విషయంలోనూ కదలిక కనబడుతోంది. అటు రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన భూముల కబ్జాకు ప్రయత్నించారన్న ఆరోపణపైనా విచారణ జరుగుతోంది.

విశాఖ కంటే ముందు.. విజయనగరం జిల్లాలో పర్యటించారు సిసోడియా. భోగాపురం మండలంలో సుమారు 120 ఎకరాల డి-పట్టా భూములు జిరాయితీగా మారిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ భూముల్లో ఓ 20 ఎకరాలను మాజీ సీఎస్‌ జవహర్‌ రెడ్డి బినామీలతో కొనుగోలు చేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. విశాఖ, విజయనగరం జిల్లాల్లో 2 వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారనేది పీతల మూర్తి ఆరోపణ. స్వయంగా ప్రజలే రెవెన్యూ ఆఫీసులకు కదిలి వస్తున్నారు. తమ భూములు ఆక్రమించారంటూ ఫిర్యాదు ఇవ్వడానికి సామాన్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పైగా స్పెషల్‌ సీఎస్‌ సిసోడియా కూడా భూకబ్జాలపై సీరియస్‌గా రియాక్ట్‌ అవుతుండడంతో.. తనకు అందిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.